icon icon icon
icon icon icon

తండ్రీ బిడ్డల్ని దూరం చేసిన అంబటి రాంబాబు అసలు మనిషేనా?

‘నా బిడ్డల్ని నాలుగేళ్లుగా నాకు దూరం చేసి, నా ప్రాణాన్ని తీసేసినంత పనిచేసి.. ఎలాంటి తప్పూ చేయలేదని బుకాయిస్తున్నారా? ఇదేనా న్యాయం’ అంటూ మంత్రి అంబటి రాంబాబును ఆయన రెండో అల్లుడు డాక్టర్‌ గౌతమ్‌ ప్రశ్నించారు.

Updated : 08 May 2024 08:47 IST

చివరి కోరికగా నా తండ్రి మనవడు, మనవరాలిని చూడాలన్నా పంపలేదు
అంబటి అల్లుడు డాక్టర్‌ గౌతమ్‌ వ్యాఖ్యలు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ‘నా బిడ్డల్ని నాలుగేళ్లుగా నాకు దూరం చేసి, నా ప్రాణాన్ని తీసేసినంత పనిచేసి.. ఎలాంటి తప్పూ చేయలేదని బుకాయిస్తున్నారా? ఇదేనా న్యాయం’ అంటూ మంత్రి అంబటి రాంబాబును ఆయన రెండో అల్లుడు డాక్టర్‌ గౌతమ్‌ ప్రశ్నించారు. ఇటీవల అంబటి రాంబాబును విమర్శిస్తూ గౌతమ్‌ వీడియో చేయగా అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దానిపై అంబటి విలేకర్ల సమావేశం పెట్టి పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ మంగళవారం మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ.. ‘‘నా వీడియోపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. నాలుగేళ్లుగా తన మనవడు, మనవరాలిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నానని, అల్లుడైన నేను ఆర్థిక సాయం చేయట్లేదని అన్నారు. నా కుమారుడు, కుమార్తెను మీరు పోషించక్కర్లేదు. రేపు మీడియా సాక్షిగా వారిద్దర్నీ మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తా లేదా నా ఇంటి వద్ద దించి వెళ్లండి. మీరు వారి కోసం ఒక్క రూపాయీ పెట్టక్కర్లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘2023 మార్చి 3న నా తండ్రి ఐసీయూలో బెడ్‌పై ఉండి తన మనవడు, మనవరాలిని చూడాలని ఉందని అంబటి రాంబాబును కోరారు. మాట్లాడలేని స్థితిలో ఉండి చివరి కోరికగా పిల్లల్ని చూడాలని ఉందని ఎంతగానో ప్రాధేయపడ్డారు. దీనిపై ఎన్ని సందేశాల్ని పంపినా రాంబాబు స్పందించలేదు. నా తండ్రి అదే నెల 22న చనిపోతే కనీసం చివరిసారి చూడటానికైనా పిల్లల్ని పంపించ లేదు. ఇదేనా మీ మంచితనం. మీ కుటుంబాన్ని ప్రశ్నిస్తే ఎంత దుర్మార్గమైనా చేసేస్తారా? ఒక తండ్రి ఆఖరి కోరిక తీర్చలేని కుమారుడిగా నన్ను చేస్తారా? అసలు మీరు మనిషేనా. మీతో విసుగెత్తి చివరికి కోర్టుకు వెళ్తే దానికీ వేరే అర్థాలు చెబుతారా?’’ అని గౌతమ్‌ ఆవేదన చెందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img