icon icon icon
icon icon icon

డోన్‌లో బుగ్గన ఉక్కిరిబిక్కిరి!

నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. బుగ్గనకు దీటైన అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అని భావించిన తెదేపా అధిష్ఠానం ఆయన్ను రంగంలోకి దింపింది.

Updated : 08 May 2024 09:29 IST

ప్రచారంలో సమస్యలపై మంత్రిని నిలదీస్తున్న ప్రజలు
దూసుకెళుతున్న తెదేపా అభ్యర్థి కోట్ల

ఈనాడు, కర్నూలు: నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. బుగ్గనకు దీటైన అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అని భావించిన తెదేపా అధిష్ఠానం ఆయన్ను రంగంలోకి దింపింది. ఈసారి డోన్‌లో పాగా వేసేందుకు జయసూర్యప్రకాశ్‌రెడ్డి వ్యూహ, ప్రతివ్యూహాలతో దూసుకెళ్తున్నారు. వాటిని తట్టుకోలేక బుగ్గన ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఆంక్షలు తట్టుకోలేక పార్టీని వీడుతుంటే..

ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న బుగ్గనపై నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన్ను కలవడానికి సొంత నియోజకవర్గ ప్రజలకే ఆంక్షలు ఎదురవటాన్ని జీర్ణించుకోలేకపోయారు. మరో ప్రత్యామ్నాయం లేక ఇప్పటివరకు ఆయన పక్షాన ఉన్న పలువురు మద్దతుదారులు.. కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి డోన్‌కు రావడంతో రూటు మార్చేస్తున్నారు.

ఉద్యోగాల కల్పనేదీ..?

డోన్‌ పేరు చెప్పగానే ఎవరికైనా నాపరాయి పరిశ్రమలు గుర్తుకువస్తాయి. ఇక్కడ వందలాది పరిశ్రమలుండగా, వేలాది మంది కార్మికులు వాటిపై ఆధారపడ్డారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఈ రంగానికి ప్రోత్సాహం కరవైంది. విద్యుత్తు బిల్లులు భారీగా పెరగడం, రాయితీలు లేకపోవడంతో నాపరాయి పరిశ్రమలు తీవ్ర నష్టాలను మూటకట్టుకున్నాయి. మరోపక్క అధికారుల తనిఖీలు, దాడులు ఎక్కువ కావడంతో యజమానులు ఆయా పరిశ్రమలను మూసేస్తుండటం వైకాపాకు ఎదురుదెబ్బే. నాపరాయి పరిశ్రమను మంత్రి బుగ్గన ఆదుకోలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. మంత్రి స్థాయిలో బుగ్గన నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలేవీ తీసుకురాలేకపోయారని, ఉద్యోగాల కల్పనకు చొరవ చూపలేదని యువత నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సిమెంట్‌నగర్‌లోని పాణ్యం సిమెంట్స్‌లో అత్యధికులు స్థానికేతరులే ఉన్నారని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

తాగునీటికీ కటకటే..

డోన్‌ మండలంలో నేటికీ పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. మంత్రి బుగ్గన కుమారుడు అర్జున్‌రెడ్డిని జలదుర్గం గ్రామ మహిళలు తాగునీటి సమస్యపై నిలదీసిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘అభివృద్ధి అంటే ఇదేనా?’ అంటూ వారు ప్రశ్నించడంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆయా ఉదంతాలను కోట్ల వర్గీయులు తమకు అనుకూలంగా మలచుకుని ఓటర్లలో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. డోన్‌లో నిర్మించిన 288 టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చాలావరకు పూర్తయినా.. నేటికీ లబ్ధిదారులకు అధికారికంగా ఇవ్వలేదు. 77 చెరువులకు నీళ్లిచ్చే ఎత్తిపోతల పథకం పూర్తిచేయడంలో అంతులేని తాత్సారం చేశారు. ఫలితంగా ప్యాపిలి మండలంలో 21 చెరువులు నిండని దుస్థితి నెలకొంది.


వైకాపా నాయకులు మా పొలంపైనే కన్నేశారు

గత ఎన్నికల్లో వైకాపా గెలుపునకు కృషి చేశాం. అధికారంలోకి వచ్చాక మా పొలంపైనే కొందరు వైకాపా నాయకులు కన్నేశారు. అధికార బలంతో మా పొలాన్ని కొంత లాక్కున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.  నేను నడిచింది ఇంత దుర్మార్గమైన పార్టీతోనా అని బాధేసింది.  

డోన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆవేదన


పంటలన్నీ దెబ్బతిన్నాయి..

డోన్‌, ప్యాపిలి ప్రాంతాల్లో ఈ ఏడాది కరవు తీవ్రంగా ఉంది. పంటలన్నీ దెబ్బతిన్నాయి. మంత్రి బుగ్గన మా ప్రాంతాన్ని కరవు మండలాలుగా ప్రకటింపజేయిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూశాం. జిల్లాలో ఎన్నో మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారే కానీ డోన్‌, ప్యాపిలి మండలాలను మాత్రం పట్టించుకోలేదు. ఇక్కడి కరవు పాలకుల కళ్లకు కనిపించకపోవడం దారుణం. రైతులు ఆర్థికంగా చితికిపోయారు.

డోన్‌ మండలంలోని యు.కొత్తపల్లెకు చెందిన ఓ రైతు ఆవేదన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img