icon icon icon
icon icon icon

జగన్‌, పెద్దిరెడ్డి.. ఖజానాను మింగేశారు

‘ఉత్తర కొరియాలో కిమ్‌ ఉన్నారు. అక్కడి ప్రజలు ఆనందంగా ఉంటే ఆయన తట్టుకోలేరు. అదేవిధంగా రాష్ట్రంలో జిమ్‌(జగన్‌) ఉన్నారు.

Published : 08 May 2024 06:58 IST

వారు తిన్నదంతా కక్కించి పేదలకు పంచుతా
పుంగనూరు సభలో తెదేపా అధినేత చంద్రబాబు 
పెద్దిరెడ్డి ఎయిడ్స్‌ కంటే ప్రమాదకరం 
భాజపా నేత కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, చిత్తూరు: ‘ఉత్తర కొరియాలో కిమ్‌ ఉన్నారు. అక్కడి ప్రజలు ఆనందంగా ఉంటే ఆయన తట్టుకోలేరు. అదేవిధంగా రాష్ట్రంలో జిమ్‌(జగన్‌) ఉన్నారు. ఇక్కడా ఎవరూ సంతోషంగా ఉండకూడదు. ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదనేది ఆయన ఉద్దేశం. రాష్ట్ర ఖజానాలోని డబ్బంతా... జగన్‌, పెద్దిరెడ్డిల దగ్గరే ఉంది. వారు తిన్నదంతా జూన్‌ 4న తర్వాత కక్కించి పేదలకు పంచి పెడతా’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మాజీ సీఎం, రాజంపేట లోక్‌సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి చంద్రబాబు చిత్తూరు జిల్లా పుంగనూరు వచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరుకు ఐదేళ్లలో తొలిసారి చంద్రబాబు రావడంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.సీఎం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు తీసుకొచ్చారని.. ఆ చట్టంతో మనందరి జుట్టూ జలగన్న చేతిలో ఉంటుందని చంద్రబాబు వివరించారు. రీసర్వేలో జగన్‌ ఇచ్చిన పాసు పుస్తకం, దానిపై ఆయన ఫొటోను చూపిస్తూ... కూటమి అధికారంలోకి రాగానే వాటన్నింటనీ తగలబెడతామని హామీ ఇచ్చారు. జగన్‌ ఫొటో ఉన్న పాసుపుస్తకం ప్రతిని చించేశారు.

నా గుండె రగిలిపోయింది: ‘ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ ఓటుకు వైకాపా నాయకులు రూ.5 వేల చొప్పున ఇవ్వబోతే... ఆ పాపిష్టి డబ్బు తమకొద్దని చెప్పి నేరుగా వెళ్లి ఓటు వేశారు. వైకాపాపై ఉద్యోగుల్లో ఇంత కసి ఉందని నేను ఊహించలేదు. ప్రజల్లో ఇంతకంటే ఎక్కువ కోపం ఉంది. పెద్దిరెడ్డిని పుంగనూరులో రాజకీయంగా భూస్థాపితం చేయాలి. పెద్దిరెడ్డి రూ.30 వేల కోట్ల అవినీతి చేశారు. అన్నమయ్య జిల్లా అంగళ్లు నుంచి నేను గతేడాది పూతలపట్టు వస్తుంటే పుంగనూరు శివారులో దాడులు చేయించారు. 450 మందిని జైలులో పెట్టించారు. ఆ ఘటన నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఆనాడు నా గుండె రగిలిపోయింది. పెద్దిరెడ్డీ నీ కథ తేలుస్తా. మీకు నిద్రలేని రాత్రులు చూపిస్తా. నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించారో మిమ్మల్నీ అంతే క్షోభ పెడతా’ అని చంద్రబాబు హెచ్చరించారు. పుంగనూరు ప్రజల నుంచి... పాడి, మామిడి రైతుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.వేల కోట్ల కమీషన్‌ తీసుకున్నారని రాజంపేట లోక్‌సభ భాజపా అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ‘క్షణం సంతోషం కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దు’ అని ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఓ ప్రకటన వచ్చేదని.. పెద్దిరెడ్డి ఎయిడ్స్‌ కంటే ప్రమాదకరమని అటువంటి వ్యక్తికి ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు.


ఆలయాల కూల్చివేతపై విచారణ చేయిస్తాం: చంద్రబాబు

తిరుమల పవిత్రతను కాపాడతాం: పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, తిరుపతి-ఈనాడు డిజిటల్‌, తిరుపతి: ‘తిరుమల పవిత్రతను దెబ్బతీసే వారిని ఎదుర్కొంటాం. వైకాపా అధికారంలోకి వచ్చాక 160పైగా ఆలయాలపై దాడులు చేశారు. అర్చకులపై దాడి చేసి కొట్టారు. ఆలయ భూములను కొట్టేశారు. వైకాపా హయాంలో ఆలయాల కూల్చివేతలపై విచారణ చేయించి, కఠిన చర్యలు తీసుకుంటాం. ఆలయాల వార్షిక ఆదాయం రూ.50 వేలపైన ఉంటే అర్చకులకు రూ.15 వేలు ఇస్తాం. అంతకంటే తక్కువ ఉంటే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అందిస్తాం. పౌరోహిత్యాన్ని కులవృత్తిగా గుర్తించి బ్రాహ్మణ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేస్తాం. తితిదే మొదలుకొని అన్ని ఆలయాల్లో బ్రాహ్మణులను ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తామని స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నా’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతిలో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం, వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ‘తిరుపతి ఆధ్యాత్మికత, తిరుమల పవిత్రతను కాపాడుకుంటాం. అమరరాజా పరిశ్రమ విస్తరణ యూనిట్‌ను మళ్లీ ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మాదే’ అని పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img