icon icon icon
icon icon icon

Smriti Irani: ‘అమేఠీలో తుపాకుల పరిశ్రమ ఉంది’: పాక్‌ నేతకు స్మృతి ఇరానీ కౌంటర్

పాకిస్థాన్‌, రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మధ్య ఉన్న సంబంధం ఏంటని భాజపా నాయకురాలు, అమేఠీ ఎంపీ స్మృతి ఇరానీ (Smriti Irani)  ప్రశ్నించారు. 

Published : 08 May 2024 10:44 IST

అమేఠీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ప్రశంసిస్తూ పాకిస్థాన్‌ (Pakistan) మాజీ మంత్రి చేసిన పోస్టుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) స్పందించారు. పాక్-రాహుల్‌కు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ‘‘నేను ఇప్పటివరకు ఒక కాంగ్రెస్ నాయకుడితో పోరాడాను. కానీ స్మృతి ఇరానీని ఓడించాలని పాక్‌ నాయకుడు ఒకరు అన్నారు. మీరు మీ దేశాన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు కానీ.. అమేఠీ గురించి ఆందోళన చెందుతున్నారు. నా మాటలు ఆ నేతవద్దకు చేరితే..ఆయనకో విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఈ అమేఠీలో ప్రధాని మోదీ సారథ్యంలో ఏకే 203 రైఫిల్స్‌ పరిశ్రమను నిర్మించారు. వాటిని పాక్‌ సరిహద్దుల్లోని ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడానికి ఉపయోగిస్తున్నారు’’ అని హెచ్చరించారు. అలాగే పాక్‌ మాజీ మంత్రి చేసిన పోస్టును రాహుల్ ఇంతవరకు ఖండించకపోవడాన్ని ప్రశ్నించారు. ఆ దేశంతో ఉన్న సంబంధం ఏంటని అడిగారు. స్వదేశంలో ఎన్నికలు జరుగుతుంటే.. విదేశీ నేల నుంచి రాహుల్‌కు మద్దతు లభిస్తోందని విమర్శించారు.

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఫవాద్‌ హుస్సేన్‌ ఇటీవల తన సోషల్‌ మీడియా ఖాతాలో రాహుల్‌ గురించి ఓ పోస్ట్‌ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత ప్రసంగించిన వీడియోను షేర్‌ చేసి.. ‘రాహుల్‌ ఆన్ ఫైర్‌’ అని రాసుకొచ్చారు. దీనిపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘పాక్‌ నేతలు రాహుల్‌ను ప్రమోట్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆ దేశంలో పోటీ చేయాలనుకుంటోందా? మేనిఫెస్టో దగ్గర నుంచి ఈ ప్రశంసల వరకు హస్తానికి దాయాదితో ఉన్న స్నేహం మరింత స్పష్టమైంది’’ అని భాజపా ఐటీ విభాగం చీఫ్‌ అమిత్ మాలవీయ విమర్శించిన సంగతి తెలిసిందే.

పట్టు కోల్పోతున్న వారసత్వం?

అమేఠీలో మరోసారి విజయం సొంతం చేసుకోవాలని స్మృతి పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమె రాహుల్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. ఈసారి కాంగ్రెస్ తరఫున ఇక్కడి నుంచి కిశోరీ లాల్‌ శర్మ పోటీ చేస్తున్నారు. హస్తానికి మంచి పట్టున్న ఈ స్థానంలో గాంధీ కుటుంబసభ్యులు పోటీలో లేకపోవడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img