icon icon icon
icon icon icon

మీ వాళ్లే వద్దంటున్నారు.. ప్రజలెలా నమ్ముతారు?

జగన్‌ను సొంత కుటుంబసభ్యులతో పాటు ఆయన పార్టీవారూ నమ్మడం లేదని, ప్రజలెలా నమ్మాలో చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు.

Published : 08 May 2024 06:59 IST

సీఎం జగన్‌ ఓ బిల్డప్‌ బాబాయ్‌
విజయనగరం సభలో లోకేశ్‌ ఎద్దేవా

ఈనాడు, విజయనగరం: జగన్‌ను సొంత కుటుంబసభ్యులతో పాటు ఆయన పార్టీవారూ నమ్మడం లేదని, ప్రజలెలా నమ్మాలో చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ఈ సీఎం ఓ బిల్డప్‌ బాబాయ్‌ అని ఎద్దేవా చేశారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో మంగళవారం నిర్వహించిన యువగళం సభలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని జగన్‌ అన్నారు. ఐదేళ్లూ ఆయనే మెడ వంచి.. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఒక ఎంపీ... బాబాయ్‌ని లేపేశారు. మరో ఎంపీ రీల్స్‌ చేస్తారు. ఓ ఎంపీ కుటుంబసభ్యులను సొంత పార్టీ నాయకులే కిడ్నాప్‌ చేస్తే ఆయన హైదరాబాద్‌ పారిపోయారు. వైఎస్‌ జమానాలో విజయసాయిరెడ్డి లెక్కలు చూసుకునేవారు. ఇప్పుడు విశాఖను దోచేసి, అక్రమంగా వచ్చిన నగదును లెక్కిస్తున్నారు. ఈ ఎంపీలెవరూ పార్లమెంటు సాక్షిగా ఆంధ్రాకు ఇది కావాలని ఏనాడూ అడగలేదు. యువ ఎంపీ టైగర్‌ రామ్మోహన్‌నాయుడు, మరో యువ కెరటం గల్లా జయదేవ్‌ మాత్రమే మన గళం వినిపించారు’ అని లోకేశ్‌ చెప్పారు. ‘విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలో వణుకు మొదలైంది. నేను బొత్సకు సవాల్‌ విసురుతున్నా... అసలు మీరు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు?’ అని ప్రశ్నించారు. 

కోడిగుడ్డు మంత్రి అవసరమా...

యువగళంలో యువతతో జరిగిన ముఖాముఖిలో లోకేశ్‌ పాల్గొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అమరరాజా సహా ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖకు ఏం తీసుకొచ్చారని అడిగితే... కోడిగుడ్డు తీసుకొచ్చామని ఐటీ మంత్రి చెబుతారని.. అలాంటి వాళ్లు మనకు అవసరమా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తామని, క్రీడారంగాన్ని బలోపేతం చేస్తామని, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img