icon icon icon
icon icon icon

ఓటుతో దిల్లీ పీఠం కదలాలి

‘బటన్‌ నొక్కితే డబ్బులు పడకుండా చంద్రబాబు చూస్తున్నారు. పథకాలను అడ్డుకుంటున్నారు. అవి అమలయ్యేలా చూడాలని కోర్టుకు వెళ్లాల్సి వస్తోందంటే ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయో ప్రజలు గమనించాలి.

Published : 08 May 2024 06:59 IST

పేదలకు డబ్బులు పడకుండా చంద్రబాబు, దిల్లీ పెద్దల కుట్ర
విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తా
షెడ్యూలు ముందు రావడంతోనే పనులు చేయలేదు
ఇచ్ఛాపురం, కోరుకొండ సభల్లో సీఎం జగన్‌ వ్యాఖ్యలు

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: ‘బటన్‌ నొక్కితే డబ్బులు పడకుండా చంద్రబాబు చూస్తున్నారు. పథకాలను అడ్డుకుంటున్నారు. అవి అమలయ్యేలా చూడాలని కోర్టుకు వెళ్లాల్సి వస్తోందంటే ఏ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయో ప్రజలు గమనించాలి. దీనంతటికీ చంద్రబాబు, దిల్లీలో ఉన్న పెద్దలు కుట్రలు పన్నారు. వారికి ఓటుతో కొట్టే దెబ్బకు దిల్లీ పీఠం కదలాలి’ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘మీ బిడ్డ క్యాలెండర్‌ ఇచ్చి ఏ నెలలో ఏం ఇస్తాడో చెప్పి మరీ ఇచ్చాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉంటాయి. ఓటుకు రూ.2వేలు, రూ.3వేలు ఇస్తారు. అవి ఎన్నికలప్పుడే ఇస్తారు. డబ్బు ఇస్తే తీసుకోండి.. ఎందుకంటే ఆ డబ్బు మనదే. ఎవరు ఉంటే మంచి జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలి. పరిపాలన వికేంద్రీకరణతో పేదల వద్దకు పాలన తీసుకువచ్చాం. విశాఖను పరిపాలన రాజధానిగా చేసి ఫలితాలు వచ్చాక అక్కడే ప్రమాణస్వీకారం చేస్తా. మ్యానిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చాం’ అని చెప్పారు.

అభ్యర్థి పేరు మరిచిపోయిన జగన్‌

ఇచ్ఛాపురం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయను సీఎం జగన్‌ ప్రియమ్మ అని పరిచయం చేశారు. దీంతో జనాలు నవ్వుకున్నారు. ‘నా కుడివైపు ప్రియమ్మ నిల్చొని ఉంది. నా చెల్లెలు’ అని పరియం చేయగా తన పేరు పిరియా విజయ అని చెప్పారు. ‘విజయమ్మ నిల్చొని ఉంది.. అన్నిరకాలుగా మంచి చేస్తుంది.. సంపూర్ణ మద్దతు ఇవ్వండి. నీ పేరు పిరియా విజయ కదమ్మా..’ అంటూ పేరును ధ్రువీకరించుకున్నారు. దిల్లీ పీఠం కదలాలంటే శ్రీకాకుళం నుంచి పునాదులు పడాలని చెబుతూ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను గెలిపించాలని ప్రజల్ని జగన్‌ కోరారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారిని సభాస్థలికి 3 కిలోమీటర్ల దూరంలో వదిలివేయడంతో నడవలేక కొందరు వెనుదిరిగారు.

రెండు నెలలు అడ్డుకుంటే ఓటేయరా?

ఈనాడు-రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే-కోరుకొండ: ‘ఇన్నేళ్లుగా అవ్వాతాతలకు ఇంటికే పింఛను ఇస్తే, రెండు నెలలు అడ్డుకున్నంత మాత్రాన.. అవ్వాతాతలు జగన్‌కు ఓటేయరా? మా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు’ అని సీఎం జగన్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

‘కోరుకొండలోని భూముల సమస్య తెలుసు. ప్రాసెస్‌లో ఉన్న ఫైల్‌ను క్లియర్‌ చేయలేకపోయాం. ఊహించని విధంగా   ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. ముందుగా ప్రకటించడంతో అనుకున్న మేరకు చేయలేకపోయాం. అధికారంలోకి రాగానే భూముల సమస్య పరిష్కరిస్తాం’ అని తెలిపారు. ఫ్యాన్‌గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజాను, ఎంపీగా గూడూరి శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. కాగా, ఉదయం నుంచే జనాన్ని తరలించడంతో తీవ్రమైన ఎండలో పిల్లలు అల్లాడిపోయారు. దాంతో చాలామంది ముందే వెనుదిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img