icon icon icon
icon icon icon

ప్రచారం పేరుతో.. కొడాలి నాని డబ్బుల పంపిణీ!

ఎన్నికల ప్రచారం పేరుతో గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామాల్లో రూ.లక్షల్లో నగదు పంచుతున్నా నియమావళి అమలు కమిటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 02 May 2024 08:48 IST

గుడివాడ నియోజకవర్గంలో గెలుపు కోసం కుయుక్తులు
పట్టించుకోని ఎన్నికల కోడ్‌ అమలు కమిటీ

ఈనాడు డిజిటల్‌, గుడివాడ: ఎన్నికల ప్రచారం పేరుతో గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని గ్రామాల్లో రూ.లక్షల్లో నగదు పంచుతున్నా నియమావళి అమలు కమిటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రెండున్నరేళ్లు మంత్రిగా, ఐదేళ్లలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో ప్రచారంలో ఏం చెప్పాలో తెలియక నాని నోట్ల కట్టలతో జనాల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఇసుక, మట్టి దోపిడీతో కూడబెట్టిన రూ.కోట్ల నగదును ఇప్పుడు బయటకు తీస్తున్నారు. ప్రచారానికి వెళ్లే గ్రామానికి, ఆ ప్రాంతంలో ఉన్న మందిరాలు, మసీదులు, చర్చిలకు రూ.లక్ష వంతున నగదును స్థానిక నాయకులు, యువతకు అందజేస్తున్నారు. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి విగ్రహ కమిటీకి ఉత్సవాలు, భోజనాల పేరుతో రూ.లక్ష చొప్పున ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, శస్త్రచికిత్సలు చేయించుకునేవారికి, వైద్య సేవలు, ఇతర కుటుంబ అవసరాలకు కనీసం రూ.20 వేలు అక్కడికక్కడే అందజేస్తున్నారు. పార్టీకి దూరంగా ఉంటున్న కార్యకర్తలు, నాయకులు, అసంతృప్తులకు ఖర్చుల కోసమంటూ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ముట్టజెబుతున్నారు. తన పట్ల అసంతృప్తిగా ఉన్న పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజల్ని ఎన్నికలకు ముందే డబ్బుతో కొనేసేందుకు కొడాలి నాని చేస్తున్న ప్రయత్నాలపై ఎన్నికల నియమావళి అమలు కమిటీ పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తెదేపా కూటమి ప్రచారంలో అడుగడుగునా వీడియో కెమెరాలతో కనిపించే ఈ కమిటీ.. నాని ప్రచారం పేరుతో రోజూ రూ.లక్షలు పంపిణీ చేస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img