icon icon icon
icon icon icon

TDP: ఉండి నుంచి రఘురామ పోటీ.. ఐదు చోట్ల అభ్యర్థులను మార్చిన తెదేపా

అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో తెదేపా స్వల్ప మార్పులు చేసింది. ఐదు చోట్ల అభ్యర్థిత్వాలను మార్చింది.

Updated : 21 Apr 2024 13:21 IST

అమరావతి: అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో తెదేపా స్వల్ప మార్పులు చేసింది. ఐదు చోట్ల అభ్యర్థిత్వాలను మార్చింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది. ఆయనతో పాటు గిడ్డి ఈశ్వరి (పాడేరు), బండారు సత్యనారాయణమూర్తి (మాడుగుల), ఎంఎస్‌ రాజు (మడకశిర), కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి)కి టికెట్లు ఖరారు చేశారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు. 

ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటి వరకు అక్కడ పార్లమెంట్‌ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు.

పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించలేదు. దీంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు కేటాయించారు. పాడేరు టికెట్‌ను గతంలో వెంకట రమేశ్‌ నాయుడుకు కేటాయించగా.. మార్పుల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించారు. మడకశిర నుంచి సునీల్‌కుమార్‌ స్థానంలో ఎంఎస్‌ రాజుకు టికెట్‌ కేటాయించారు. వెంకటగిరి స్థానాన్ని ఇదివరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణనే అభ్యర్థిగా ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img