ఆలూ తినండి అంటున్న బెల్జియం.. కారణమిదీ

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు, భౌతిక దూరం పాటించాలని అన్ని దేశాలూ తమ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ బెల్జియం మాత్రం వాటితో పాటుగా బంగాళ దుంపలు ఎక్కువగా తినాలని కోరుతోంది. ఇంతకీ ఎందుకో మీరే

Updated : 14 May 2020 12:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు, భౌతిక దూరం పాటించాలని అన్ని దేశాలూ తమ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. కానీ బెల్జియం మాత్రం వాటితో పాటుగా బంగాళ దుంపలు ఎక్కువగా తినాలని కోరుతోంది. ఇంతకీ ఎందుకో మీరే చదివేయండి.. 

కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం పాతాళానికి పడిపోయింది. కరోనా కట్టడిలో భాగంగా దేశాలన్నీ రాకపోకలను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో అనేక దేశాలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోలేక.. తమకు అవసరమైన వాటిని దిగుమతి చేసుకోలేక తంటాలు పడుతున్నాయి. బంగాళదుంపల విషయంలో ఇప్పుడు బెల్జియం కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటోంది.

ప్రపంచంలోనే అత్యధికంగా ఆలూ పండించే దేశం బెల్జియం. దాదాపు 160 దేశాలకు ఇక్కడి నుంచే బంగాళ దుంపలు ఎగుమతి అవుతుంటాయి. ఆయా దేశాల్లోని రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు బెల్జియం బంగాళ దుంపలనే వినియోగిస్తుంటాయి. వీటితోనే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చిప్స్‌ తదితర ఆహార పదార్థాలు తయారు చేస్తారు. తాజాగా ఎదురైన కరోనా సంక్షోభంతో బంగాళ దుంపల డిమాండ్‌ 80 శాతం పడిపోయింది. దీంతో ఈ ఏడాది 7,50,000 టన్నుల బంగాళ దుంపలను బెల్జియం ఎగుమతి చేయలేకపోయింది. దీంతో అవన్నీ ఆ దేశంలోనే ఉండిపోయాయి.

ఎక్కువ రోజులు వాటిని నిల్వచేయలేని పరిస్థితి నెలకొనడంతో అక్కడి ప్రభుత్వం కొన్ని బంగాళ దుంపలను ఫుడ్‌ బ్యాంక్స్‌కి, పశువులకు గ్రాసంగా పంచిపెట్టింది. మరికొన్నింటిని బయో ఎనర్జీకి ఉపయోగించింది. అయినా భారీగా మిగిలిపోవడంతో ప్రజలకు ఓ విజ్ఞప్తి చేసింది. ఇకపై ప్రజలు బంగాళ దుంపలను సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ కొని తినండని కోరింది. దేశంలోని రైతులు 125 మిలియన్‌ యూరోలు నష్టపోతున్నారని, వారిని ఆదుకోవడం కోసమైనా బంగాళ దుంపలను ఎక్కువగా వినియోగించాలని చెప్పింది. బంగాళ దుంపలతో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చిప్స్‌ తయారు చేసి అమ్ముతామంటే అనుమతులు కూడా ఇస్తామని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని