China: ఆకాశాన్ని తాకే రీతిలో అద్భుతమైన ఆలయాలు.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే!

మౌంట్‌ ఫ్యాన్జింగ్‌ (Mount Fanjing).. చైనాలోని (China) వులింగ్‌ పర్వత శ్రేణి ప్రాంతం. ఈ భూ ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ నిటారుగా పక్కపక్కనే ఉన్న కొండలపై రెండు ఆలయాలు (Temples) నిర్మించారు. వాటిని కలిపే విధంగా ఓ ఆర్చి బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దాని వింతలు, విశేషాలు తెలుసుకోండి. 

Updated : 14 Jun 2023 12:39 IST

Image : Aesthetica twitter

మౌంట్‌ ఫ్యాన్జింగ్‌  (Mount Fanjing) సహజ సిద్ధమైన రాతి శిఖరం పై భాగాన్ని ‘రెడ్‌ క్లౌడ్స్‌ గోల్డెన్‌ పీక్‌’ అని పిలుస్తారు. వీటిపై నిర్మించిన రెండు బౌద్ధ ఆలయాలకు (Temples) కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో ఈ ఆలయాలను అంత ఎత్తులో నిర్మించడం ఒక వింత అనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయాలు పునర్మించినవని మరి కొందరి వాదన. చాలా ఎత్తులో ఉండటం మూలంగా ఇక్కడ బలమైన గాలులు వీస్తుంటాయి. ప్రతికూల వాతావరణం ఉంటుంది. వాటిని తట్టుకునేలా ఈ ఆలయ నిర్మాణాలను పూర్తి చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులోని ఒక బౌద్ధ ఆలయాన్ని శాక్యమునికి అంకితం చేశారట. అది వర్తమానాన్ని సూచిస్తుంది. మరో ఆలయాన్ని మైత్రేయకు అంకితం చేశారు. భవిష్యత్తులో శాక్యముని వారసుడిగా మైత్రేయ అందరికీ జ్ఞానోదయం కలిగిస్తాడని నమ్ముతున్నారు. సముద్ర మట్టానికి 8430 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని 2018లో యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

8 వేల మెట్లు ఎక్కాలి!

స్వర్గాన్ని తలపించే ఈ బౌద్ధ ఆలయాలను చేరుకోవాలంటే సందర్శకులు సుమారు 8వేల మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అంత ఓపిక లేని వారి కోసం కేబుల్ కార్లు తిరుగుతుంటాయి. మెట్ల మార్గం గుండా వెళితే తొలుత దక్షిణం వైపున ఉన్న బుద్ధుని ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత వంతెన దాటి ఉత్తరం వైపు వెళితే మైత్రేయ ఆలయం చేరుకోవచ్చు. వంతెన దాటే సమయంలో మేఘాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. మెట్లు ఎక్కుతున్న సందర్భంలోనే మింగ్‌ (1368-1644), క్వింగ్‌ (1644-1911) రాజవంశాలు వేసిన శాసనాలు కన్పిస్తాయి.

మైత్రేయుడి జ్ఞానోదయ ప్రదేశం!

ఫ్యాన్జింగ్‌ పర్వతం మొత్తం బౌద్ధ మతంలో పరమ పవిత్రమైంది. మైత్రేయ బుద్ధుని జ్ఞానోదయ ప్రదేశంగా దీనిని విశ్వసిస్తారు. మైత్రేయ అంటే ‘భవిష్యత్తు బుద్ధుడు’. బౌద్ధ సంప్రదాయం ప్రకారం.. ఇతరులకు జ్ఞానోదయం కలిగించేందుకు ఆయన భూమిపైకి వస్తాడట. ప్రాచీన కాలంలో ఫ్యాన్జింగ్‌ అనేక బౌద్ధ ఆలయాలకు నిలయంగా ఉందని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. వాటిలో చాలా వరకు 16వ శతాబ్దంలో జరిగిన దాడుల్లో ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఈ పర్వతశ్రేణి చుట్టూ 50 బౌద్ధ ఆలయాలు మాత్రమే ఉన్నాయి.  

చైనాలో ఫ్యాన్జింగ్‌ పర్వతం ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. కేవలం చైనీయులు మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు తరలివచ్చి ఫ్యాన్జింగ్‌ నేషనల్ నేచర్‌ రిజర్వ్‌ అందాలను ఆస్వాదిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని చూసి తీరాల్సిందేనని ఇక్కడి సౌందర్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన పర్యాటకులు చెప్పేమాట. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు