Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Jan 2022 13:17 IST

1. India Corona: కొనసాగుతోన్నఉద్ధృతి.. కొత్తగా 2.68 లక్షల కేసులు

దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 2,68,833 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందురోజు కంటే నాలుగున్నర వేలకుపైగా అదనపు కేసులు వెలుగుచూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు సైతం 16.66 శాతానికి చేరింది. నిన్న 16.13 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6041కి పెరిగింది. కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు 14 లక్షలు దాటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. యాడ్‌ మార్కెట్‌పై పట్టుకోసం.. గూగుల్‌, ఫేస్‌బుక్‌ మధ్య చట్టవిరుద్ధ ఒప్పందం!

రోజురోజుకీ అమెరికన్ టెక్‌ కంపెనీలు ఆర్థికంగా బలంగా తయారవుతున్నాయి. ఈ క్రమంలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం అనైతిక చర్యలకు సైతం పాల్పడుతున్నాయన్న ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ‘యాడ్‌ మార్కెట్‌’ను శాసించేందుకు అవసరమైతే ప్రత్యర్థి కంపెనీలతోనూ చేతులు కలుపుతున్నాయన్న విమర్శలూ వస్తున్నాయి. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ అమెరికాలోని ఓ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వెయ్యి కోట్లకుపైగా వ్యూస్‌వీడియో.. యూట్యూబ్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు

పది కోట్లు కాదు.. వంద కోట్లు కాదు.. ఏకంగా వెయ్యి కోట్లకుపైగా వ్యూస్‌ సాధించి యూట్యూబ్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పిందో వీడియో. అయితే, అదేదో పాప్‌ సాంగో.. వైరల్‌ వీడియోనో అనుకుంటే పొరపాటే! చిన్నారులకు సంబంధించిన ఓ పాట ఈ ఫీట్‌ సాధించడం గమనార్హం. ‘పింక్‌ఫాంగ్’ యూట్యూబ్‌ ఛానల్‌కు చెందిన ‘బేబీ షార్క్ డ్యాన్స్‌’ వీడియో వ్యూస్‌ తాజాగా వెయ్యి కోట్లు దాటాయి. ఈ ప్లాట్‌ఫాంపై ఇలాంటి రికార్డు సాధించిన తొలి వీడియో ఇదే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Sukumar: సుకుమార్‌ని ‘ఛాన్స్‌’ అడిగిన బాలీవుడ్‌ హీరో!

అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్‌ 17న విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ‘పుష్ప’కి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బన్నీ, సుకుమార్‌కు అక్కడ క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్‌ నటనను, సుక్కు దర్శకత్వ ప్రతిభను కొనియాడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ అయితే, ఏకంగా తనతో ఓ సినిమా చేయాలని కోరడట. ఈ విషయాన్ని స్వయంగా సుకుమారే వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. India-China: సైనిక దినోత్సవం రోజున చైనాకు ఘాటు హెచ్చరికలు

దేశ సరిహద్దుల వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే కుయుక్తుల్ని ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె పునరుద్ఘాటించారు. భారత్‌ ఎల్లవేళలా శాంతినే కాంక్షిస్తుందని.. అది బలం నుంచి పుట్టిన ఆకాంక్షేనని స్పష్టం చేశారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని హితవు పలికారు. జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా ఆయన పరోక్షంగా చైనాను ఘాటుగా హెచ్చరించారు. ఏటా జనవరి 15న జాతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకొంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* శక్తిమంతమైనపాస్‌పోర్ట్‌ల జాబితాలో మెరుగైన భారత్‌ ర్యాంకు

6. కూరగాయల బామ్మతో చెంపపై కొట్టించుకున్న మంత్రి

మధ్యప్రదేశ్‌ ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రద్యుమ్నసింగ్‌ తన గొప్ప మనసు చాటుకున్నారు. గ్వాలియర్‌లో కూరగాయలు అమ్ముకొని జీవించే బామ్మ కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరారు. రోడ్డుపై రద్దీ పెరుగుతోందన్న కారణంగా స్థానికంగా ఉండే ఓ కూరగాయల మార్కెటును అధికారులు మరోచోటుకు తరలించబోయారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మంత్రిని చూసి.. బాబినా బాయ్‌ అనే వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలమ్మి బతికే తనకు ఉపాధిని దూరం చేస్తున్నారని కంటతడి పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మదనపల్లెలో దారుణం.. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు మృతి

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్‌ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వాల్మీకిపురం మండలం చంతపర్తి గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ (21), అతని స్నేహితుడు సిద్ధిక్‌ (21)లు మదనపల్లె నుంచి ద్విచక్రవాహనంపై శుక్రవారం రాత్రి చింతపర్తికి వెళ్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సంక్రాంతి నాడు... స‌న్ క్రాంతి గురించి తెలుసుకుందామా?

మనిషికీ ప్రకృతికీ, మనిషికీ మట్టికీ, ముఖ్యంగా మనిషికీ.. సూర్యుడికీ మధ్యనున్న అన్యోన్య సంబంధాన్నీ, అవినాభావ అనుబంధాన్నీ నొక్కిచెప్పే పండుగ. ప్రతి జీవికీ ప్రత్యక్ష దైవమైన సూర్యుడి మకర ప్రవేశం.. మనం కష్టించి పండించిన ధాన్యలక్ష్మి గృహప్రవేశం.. ఈ రెండు శుభాల సంరంభం సన్‌ క్రాంతి. కానీ నేడు మనం ఈ ప్రకృతితో మనకున్న బంధాలను బండగా తెంచేసుకుంటున్నాం. సూర్యుడి ముఖం చూడటం మానేశాం. పంటల ప్రస్తావనే వదిలేశాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆటగాళ్ల కన్నా ఆస్ట్రేలియా ఓపెనే ముఖ్యం : రఫేల్ నాదల్‌

సెర్బియా ఆటగాడు, ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారుడు నోవాక్‌ జకోవిచ్.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనకుండా నిషేధం విధించడంపై ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన స్పెయిన్ ఆటగాడు రఫేల్ నాదల్.. ‘ఆటగాళ్ల కన్నా ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణే చాలా ముఖ్యమైనది. జకోవిచ్ ఆడినా, ఆడకపోయినా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గొప్పగా సాగుతుంది. జకోవిచ్‌ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించనప్పటికీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Balakrishna: సంక్రాంతి వేడుకల్లో బాలయ్య.. గుర్రంఎక్కి సందడి

కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో సోదరి దగ్గుబాటి పురందేశ్వరి, బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి వారి నివాసంలో సందడి చేశారు. గుర్రంపై ఎక్కి అభిమానులను అలరించారు.  బాలకృష్ణను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: చంద్రబాబు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని