Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 09 Apr 2024 16:59 IST

1. కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో దక్కని ఊరట

మద్యం విధానం కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేజ్రీవాల్‌ అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు.’’ అని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. తెదేపాకు విరాళాలు ఇవ్వండి.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన చంద్రబాబు

 తెదేపా విరాళాల వెబ్‌సైట్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో https://tdpforandhra.com వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొలి చందాగా రూ.99,999 రూపాయల విరాళాన్ని చంద్రబాబు పార్టీకి అందచేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. పిఠాపురంలో పవన్‌కు 65వేల మెజార్టీ ఖాయం: రఘురామ

అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొని, స్వర్ణాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేద్దామని నర్సాపురం ఎంపీ, తెదేపా నేత రఘురామ కృష్ణరాజు అన్నారు. కాకినాడ జిల్లా చేబ్రోలులో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. పవన్‌, నాగబాబుతో మంచి సంబంధాలున్నాయని, ఎక్కడి నుంచి పోటీ చేసినా.. పవన్‌ తన తరఫున ప్రచారం చేస్తారని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. భారాస సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులపై వేటు

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ భారాస సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ప్‌ ఉద్యోగులతో మెదక్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. నెట్‌వర్క్‌ లేకున్నా ఫోన్‌ కనిపెట్టేయొచ్చు.. ఫైండ్‌ మై డివైజ్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన గూగుల్‌

పోగొట్టుకున్న మొబైల్‌ను కనిపెట్టాలంటే చాలా కష్టం. పొరపాటున ఎవరైనా మన ఫోన్‌ దొంగిలిస్తే దానిపై ఆశలు వదలుకోవాల్సిన పరిస్థితి. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించేందుకు ‘ఫైండ్‌ మై డివైజ్‌’ (Find My Device) లాంటి సదుపాయం ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోయినా, డివైజ్‌ ఆఫ్‌లైన్‌లో ఉన్నా గుర్తించడం కష్టం. ఇలాంటి సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ గూగుల్‌ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. తన Find My Device సదుపాయాన్ని అప్‌గ్రేడ్‌ చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. మన దేశం బలంగా ఉంటేనే.. ప్రపంచం మాట వింటుంది : ప్రధాని మోదీ

ఎంతటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించగల శక్తి తనకుందంటూ భారత్‌ ప్రపంచానికి నిరూపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని పీలీభీత్‌లో భాజపా మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రసంగించిన ఆయన.. భారత్‌ గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్నికల వేళ.. సీఈసీ రాజీవ్‌ కుమార్‌కు ‘జెడ్‌’ కేటగిరి భద్రత

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ‘జెడ్‌’ కేటగిరి కింద వీఐపీ భద్రత కల్పించింది. దీంతో సాయుధ కమాండో దళాలు ఆయనకు పూర్తి రక్షణ కల్పించనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. మోదీ హయాంలో.. ఒక్క అంగుళాన్నీ చైనా ఆక్రమించలేదు: అమిత్‌ షా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హయాంలో భారత భూభాగంలో ఒక్క అంగుళాన్నీ చైనా (China) ఆక్రమించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ‘బై-బై’ చెప్పిన తీరును ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా అస్సాంలోని లఖింపుర్‌లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ‘కుష్‌’ కోసం సమాధులు తవ్వుతున్నారు.. చేసేదిలేక ఎమర్జెన్సీ!

 సాధారణంగా ఒక దేశంలో ఆర్థిక పరిస్థితి అదుపు తప్పితేనో, లేక రాజకీయ సంక్షోభం తలెత్తితేనో అత్యవసర పరిస్థితి విధిస్తారు. శాంతి భద్రతలు చేయి దాటిపోయినా కఠిన ఆంక్షలు అమలుచేస్తారు. కానీ, దేశ ప్రజలు డ్రగ్స్ మత్తులో ఊగిపోతున్నారని ఎమర్జెన్సీ విధించారని ఎప్పుడైనా విన్నారా? పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌లో (Sierra Leone) అదే జరిగింది. యువకుల్లో చాలామంది ఓ రకమైన మత్తు పదార్థం తీసుకొని వీధుల్లో పడిపోతున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి: ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు

పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి తెదేపా, జనసేన, భాజపా కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను పక్కన పెట్టి.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు