Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 13 Oct 2022 21:18 IST

1. పదోతరగతి పరీక్షలపై కీలక నిర్ణయం.. ఇక నుంచి 6 పేపర్లే

తెలంగాణలో పదో తరగతి పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 6 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహించాలన్న విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 11 పేపర్లతో పది పరీక్షలు జరుగుతున్నాయి. హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు ఉంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హింసించారు: నరేంద్ర

సామాజిక మాధ్యమాల పోస్టుల కేసులో అరెస్టయిన తెదేపా మీడియా ఇన్‌ఛార్జి  దారపునేని నరేంద్రను సీఐడీ అధికారులు హింసించినట్టు ఆరోపణలు వచ్చాయి. నరేంద్రను సీఐడీ కార్యాలయం నుంచి గుంటూరులోని సీఐడీ న్యాయస్థానానికి తీసుకొచ్చిన సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కోర్టు వద్ద తనను కలిసిన న్యాయవాదులు, తెదేపా నేతల ముందు నరేంద్ర కన్నీరు పెట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. హైదరాబాద్‌లో తగ్గిన గృహ విక్రయాలు.. వీటికే డిమాండ్‌ ఎక్కువ!

నగరంలో రోజు రోజుకూ గృహాల విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొవిడ్‌ తరువాత స్థిరాస్తి వ్యాపారం బాగా పుంజుకుందని అంచనా వేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్టు తాజాగా నైట్‌ఫ్రాంక్‌ సంస్థ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన తొమ్మిది నెలల్లో .. గత ఏడాది రూ.27,640 కోట్ల విలువైన 62,052 గృహ యూనిట్లు అమ్ముడు పోగా ఈ ఏడాది అదే సమయంలో 25,094 కోట్ల విలువైన 50,953 గృహ యూనిట్లు మాత్రమే విక్రయాలు జరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. మునుగోడులో రాజకీయ కుట్ర జరుగుతోంది: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలవకుండా మునుగోడులో రాజకీయ కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘తెరాస, భాజపా మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకుండా కుట్ర చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య చర్చ ఉండేలా ప్రజలను రెచ్చగొడుతున్నాయి. మునుగోడుతో పాటు నల్గొండ ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది’’ అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ఖర్గేను ఒకలా..! నన్నొకలా..!! అసంతృప్తి వ్యక్తం చేసిన థరూర్‌

కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నిలిచిన సీనియర్ నేత శశిథరూర్‌ తన విమర్శలకు పదును పెంచారు. మరో అభ్యర్థి మల్లిఖార్జున ఖర్గేకు తనకూ మధ్య చూపుతోన్న వ్యత్యాసంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పారదర్శక ఎన్నిక ప్రక్రియను దెబ్బతీస్తుందని అన్నారు. దిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. మహిళల ఆసియా కప్‌.. ‘లంక’ను కొట్టాలి.. ‘భారత్‌’ టైటిల్‌ పట్టేయాలి!

ప్రస్తుత ఏడాదిలో పురుష క్రికెటర్లు చేయలేని ఘనతను.. భారత మహిళామణులు సాధించే అవకాశం వచ్చింది. ఆసియా కప్‌లో భారత్‌ అదరగొట్టేసి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇదేంటి ఇప్పుడంతా పొట్టి ప్రపంచకప్‌ మేనియా కదా.. ఆసియా కప్‌ ఎక్కడొచ్చిందని కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇది మహిళల ఆసియా కప్‌.. టైటిల్‌ కోసం శ్రీలంకతో భారత్‌ శనివారం (అక్టోబర్ 15న) తలపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్లలో ఆధిక్యం ఎవరు..?  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. అప్పు చెల్లించాలని బ్యాంకు నోటీసులు.. అంతలోనే రూ.70లక్షల లాటరీ!

మధ్యాహ్నం 12 గంటలవుతోంది. పోఖున్జు అనే వ్యక్తికి ఓ ఉత్తరం వచ్చింది... అప్పు చెల్లించాలని, లేదంటే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బ్యాంకు వారు హెచ్చరిస్తూ పంపిన నోటీసు అది... దాన్ని చూడగానే పోఖున్జుకు కాలికింద భూమి కదిలిపోయినట్టయింది.. భార్య, పిల్లలు రోడ్డున పడతారేమోనన్న భయంతో వణికిపోయాడు.. ఇంటిని నిలబెట్టుకునేందుకు ఎవరిని అప్పు అడగాలి? ఎవరి కాళ్లు పట్టుకోవాలి? పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ముచ్చటగా మూడోసారి.. ‘ఆర్టెమిస్‌ 1’ ప్రయోగానికి మళ్లీ ముహూర్తం..!

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ఆర్టెమిస్-1’ (Artemis 1) ప్రయోగానికి ముచ్చటగా మూడోసారి షెడ్యూల్‌ ఖరారైంది. అమెరికా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా NASA) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. మూడో ప్రయత్నంగా నవంబరు 14న ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు నాసా సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. PPF, SSY మదుపుదారులకు ఇ-పాస్‌బుక్‌ సదుపాయం.. ఇక పోస్టాఫీసుకు వెళ్లక్కర్లేదు!

పోస్టాఫీసులో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మదుపు చేసే వారికి గుడ్‌న్యూస్‌. పీపీఎఫ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పొదుపు పథకాలకు సంబంధించి బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్‌ వంటివి ఇకపై ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఈ మేరకు తపాలా శాఖ ఇ-పాస్‌బుక్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్‌ 12 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ఓ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. భారతీయులపై బ్రేవర్మన్‌ వ్యాఖ్యల దుమారం.. యూకే దిద్దుబాటు చర్యలు

వీసా పరిమితి దాటినా.. దేశంలోనే ఉండిపోతున్నారంటూ భారతీయులను ఉద్దేశించి బ్రిటన్‌ హోంమంత్రి సుయెలా బ్రేవర్మన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో యూకే దిద్దుబాటు చర్యలకు దిగింది. భారత్‌తో తాము అత్యంత బలమైన వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్నామని బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని