Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 12 Aug 2022 20:58 IST

1. నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరగనుంది: రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు ప్రజల సమస్యలపై పోరాడుతున్నానని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు పట్టణకేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాను చేసిన త్యాగం వల్లే మునుగోడు అభివృద్ధి జరగనుందని తెలిపారు. ప్రజల అభిప్రాయం, అంగీకారంతోనే రాజీనామా చేశానని వెల్లడించారు. ఈనెల 21న మునుగోడులో భారీ బహిరంగసభ పెట్టి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.

2. మా విజ్ఞప్తిని కృష్ణాబోర్డు తప్పుగా అర్థం చేసుకుంది: తెలంగాణ ఈఎన్సీ

గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కేఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పనులు చేపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రెండు ప్రాజెక్టుల విస్తరణ పనులకు అనుమతి ఇవ్వడం తగదని అభిప్రాయం వ్యక్తం చేశారు.


Video: రాఖీ..సోదరికి రూ.5 బిల్లలతో తులాభారం..!


3. విశాఖలో ఎల్లుండి నుంచి అగ్నిపథ్‌ ర్యాలీ.. ఏర్పాట్లు చేస్తున్న ఆర్మీ అధికారులు

సైన్యంలో అగ్నివీరులుగా విధులు నిర్వర్తించాలనుకునే వారికోసం విశాఖపట్నంలో ఈ నెల 14 నుంచి అగ్నిపథ్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దేహదారుఢ్య పరీక్షలకు నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. 14 నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్‌ జిల్లాలు, యానాంకు చెందినవారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

4. అద్దెపై 18% జీఎస్‌టీ.. కేంద్రం క్లారిటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జూన్‌లో జరిగిన 47వ జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక మార్పులకు ఆమోదముద్ర వేశారు. ఇవి జులై 18 నుంచి అమల్లోకి వచ్చాయి. అద్దెకుంటున్నవారు అద్దెపై 18 శాతం జీఎస్‌టీ చెల్లించాలన్నది అందులో ఒకటి. అయితే, ఈ విషయంలో ఎవరెవరికీ జీఎస్‌టీ వర్తించనుందనే దానిపై ఇటీవల మీడియాలో భిన్నమైన కథనాలు వెలువడ్డాయి. దీనిపై తాజాగా కేంద్ర స్పష్టతనిచ్చింది. 

5. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గింది.. అయినా ఆందోళనకర స్థాయిలోనే!

దేశంలో వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail inflation) కాస్త తగ్గుముఖం పట్టింది. జులైలో ఇది 6.71 శాతంగా నమోదైంది. దేశంలో ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడమే దీనికి కారణం. ఈ మేరకు కేంద్ర గణాంక శాఖ (NSO) శుక్రవారం గణాంకాలను వెల్లడించింది. దీని ప్రకారం జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం (7.01 శాతం)తో పోలిస్తే జులైలో కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కల్పించే అంశం. 2021లో ఇదే నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.59 శాతమే.


Video: శాంసంగ్‌ వారసుడికి కొరియా క్షమాభిక్ష..!


6. గూగుల్‌ ఉద్యోగుల పనితీరుపై సీఈఓ సుందర్‌ పిచాయ్‌ అసంతృప్తి?

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తమ కంపెనీ ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన వారితో నేరుగా ప్రస్తావించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఉత్పత్తులు, సేవలను మరింత మెరుగుపరిచి కస్టమర్ల మన్ననలను చూరగొనడంపై దృష్టిసారించాలని పిచాయ్‌ సూచించారు. గూగుల్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే కంపెనీ పనితీరు, ఉత్పాదకత ఆశించిన స్థాయిలో లేదని పిచాయ్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

7. ఆమిర్‌ ఖాన్‌.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తమ రాష్ట్ర సందర్శనను వాయిదా వేసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. ప్రస్తుతం తాము హర్‌ ఘర్ తిరంగా వేడుకల్లో నిమగ్నమై ఉన్నామని.. ఈ నెల 15 తర్వాతనే ఇక్కడకు వచ్చేలా చూసుకోవాలని సూచించారు. గువాహటిలో మీడియాతో మాట్లాడుతూ.. హిమంత ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆమిర్‌ ఖాన్ ఈ రాష్ట్రాన్ని సందర్శించాలనుకుంటున్నారు. దాని గురించి నాతో మాట్లాడారు’ అని తెలిపారు.

8. కారుణ్య మరణం కోసం స్విట్జర్లాండ్‌కు..? అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన మిత్రురాలు

దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతోన్న ఓ వ్యక్తి కారుణ్య మరణానికి (Euthanasia) సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత్‌లో అందుకు అనుమతి లేకపోవడంతో స్విట్జర్లాండ్‌ (Switzerland) వెళ్లి మరణించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో చికిత్స పేరు చెప్పి యూరప్‌ వీసా కూడా పొందాడు. అయితే, ఆయన వెళ్లేది చికిత్స కోసం కాదని.. కారుణ్య మరణానికేనంటూ బాధితుడి మిత్రురాలు పేర్కొంటున్నారు. దీంతో ఆయనను స్విట్జర్లాండ్‌ వెళ్లకుండా అడ్డుకోవాలని కోరుతూ దిల్లీ హై కోర్టును (Delhi HC) ఆశ్రయించారు.


Video: సినిమాను తలపించేలా నోట్ల గుట్టలు స్వాధీనం


9. విండీస్‌ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!

వెస్టిండీస్‌ ఇటీవల వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతోంది. తాజాగా బుధవారం జమైకాలోని సబీనా పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లోనూ పరాజయం పాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లు సంచలన ఫీల్డింగ్ చేశారు. విండీస్‌ ఫీల్డర్లు మూడు కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకొన్నారు. తొలుత న్యూజిలాండ్ ఓపెనర్‌ మార్టిన్ గప్టిల్‌ ఆఫ్‌సైడ్‌ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్‌ వద్ద ఉన్న షిమ్రాన్ హెట్మెయర్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టి ఔరా అనిపించాడు.

10. ట్విన్‌ టవర్ల కూల్చివేత మరోసారి పొడిగింపు.. కారణమిదే!

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత తేదీని సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 21వ తేదీన ఉన్న డెడ్‌లైన్‌ను ఆగస్టు 28 వరకు పెంచింది. ఈ నిర్దిష్ట తేదీ నుంచి సెప్టెంబర్‌ 4వరకు కూల్చివేత ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. సాంకేతికత, వాతావరణ పరిస్థితుల కారణంగానే కూల్చివేత తేదీని పొడిగించినట్లు స్పష్టం చేసింది. అక్రమంగా నిర్మించిన ట్విన్‌ టవర్ల భవనాన్ని నిజానికైతే మే 22వ తేదీనే కూల్చివేయాల్సి ఉండగా.. మూడు నెలల గడువు కల్పిస్తూ సుప్రీంకోర్టు గత నెల ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని