Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Apr 2024 17:05 IST

1. భువనగిరి నేతలతో సీఎం సమావేశం.. ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం

భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యనేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈనెల 21న నామినేషన్‌ వేయనున్న నేపథ్యంలో అదే రోజు భువనగిరిలో బహిరంగ సభ నిర్వహించాలని సీఎం సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్సీ

వైకాపా ఎమ్మెల్సీ, హిందూపురం నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత మహమ్మద్‌ ఇక్బాల్‌ తెదేపాలో చేరారు. అధినేత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్బాల్‌ ఇటీవలే వైకాపాకు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.  సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అభ్యర్థిని ప్రకటించిన భారాస

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భారాస అభ్యర్థిని ప్రకటించింది. లాస్య నందిత సోదరి, దివంగత సాయన్న కుమార్తె నివేదితను భారాస అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్‌ ఎంపిక చేశారు. కంటోన్మెంట్‌ నేతలతో ఉప ఎన్నికపై చర్చించిన అనంతరం నివేదిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎన్‌ఐఏ అధికారికి భాజపా పార్సిల్‌.. ఆధారాలతో సుప్రీంను ఆశ్రయిస్తాం: అభిషేక్‌ బెనర్జీ

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తమ నేతలను లక్ష్యంగా చేసుకుందని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. అందులోభాగంగా తమపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)ను ప్రయోగిస్తోందన్నారు. దానికి చెందిన ఓ అధికారితో భాజపా నాయకుడికి డీలింగ్‌ కుదిరిందన్నారు. ఓ పార్శిల్‌ చేతులు మారిందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రచారంలో యువతికి ముద్దు.. వివాదంలో ఎంపీ

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం జోరందుకుంది. పశ్చిమ బెంగాల్‌లో ఓ భాజపా (BJP) ఎంపీ కూడా ఇటీవల ఓట్ల కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆ సమయంలో ఓ యువతి బుగ్గపై ఆయన ముద్దు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌లో ఎన్నికల ప్రచారం.. 25 దేశాల పార్టీలకు భాజపా ఆహ్వానం

ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రచార తీరును చూసేందుకు విదేశాలకు చెందిన రాజకీయ పార్టీలు త్వరలో భారత్‌కు రానున్నాయి. 25 దేశాలకు చెందిన ఆయా పార్టీలను కేంద్రంలోని భాజపా ఆహ్వానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ట్రూకాలర్‌లో వెబ్‌ వెర్షన్‌.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు

కాంటాక్టుల్లో లేని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించేందుకు ఉపయోగించే ట్రూకాలర్ (Truecaller).. మరో కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. వాట్సప్‌, టెలిగ్రామ్‌ తరహాలో ‘ట్రూ కాలర్‌ వెబ్‌’ను తీసుకొచ్చింది. దీనిద్వారా మీ మొబైల్‌ను డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్‌ చేసి గుర్తుతెలియని నంబర్ల వివరాలను తెలుసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. లాభాల్లో సూచీలు.. తొలిసారి 75 వేలు ఎగువన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో రిలయన్స్‌, ఐటీసీ, ఎయిర్‌టెల్‌ వంటి షేర్లలో కొనుగోళ్లు.. సూచీలకు కలిసొచ్చింది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో 75వేల మార్కును దాటిన సెన్సెక్స్‌.. ఇవాళ తొలిసారి 75 వేల ఎగువన ముగిసింది. నిఫ్టీ సైతం 22,700 పైన స్థిరపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నితీశ్‌ రెడ్డి.. భారత్‌ క్రికెట్‌కు మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ లభించినట్లేనా?

భారత జట్టులో నికార్సైన పేస్‌ ఆల్‌రౌండర్‌ కొరత చాలా ఏళ్ల నుంచి ఉంది. ఆ స్థానం భర్తీ చేసేందుకు వచ్చిన వాళ్లు అవకాశాలను నిలబెట్టుకోవడం లేదు. ఈ ఐపీఎల్‌లో ఆ లోటును తీర్చేలా ఓ ఆంధ్రా కుర్రాడు కనిపించాడు. అతడే నితీశ్ కుమార్‌రెడ్డి. ఒక్క ఇన్నింగ్స్‌తోనే ఇతడు హార్దిక్‌ పాండ్యతో కలిసి బాధ్యతలు పంచుకుంటాడా..? అనే చర్చకు కారణమయ్యాడు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

10. గాజాలో ఇజ్రాయెల్‌ అధినేత తప్పు చేస్తున్నాడు: బైడెన్‌

హమాస్‌ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ‘‘నెతన్యాహూ గాజాలో తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని నేను అంగీకరించను. ఆరు లేదా ఎనిమిది వారాలపాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెలీలను కోరుతున్నాను’’ అని  వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని