Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లో పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 22 Jun 2022 21:16 IST

1. ‘మహా’ ఉత్కంఠ.. ఉద్ధవ్‌కు పవార్‌ కీలక సూచన!

రాజీనామాకు సిద్ధమేనని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించిన తర్వాత.. ఆయనతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ భేటీ అయ్యారు. సుప్రియా సూలే, జితేంద్ర అవద్‌తో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన పవార్‌.. దాదాపు గంట పాటు మంతనాలు జరిపారు. ఈ కీలక భేటీలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేను ముఖ్యమంత్రి చేయాలని పవార్‌, కాంగ్రెస్‌ పార్టీ సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీ మునుగడ కోసం ‘అసహజ ఫ్రంట్‌’ నుంచి శివసేన తప్పుకోవడమే మంచిదని ఏక్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు. 

2. సంజయ్‌ ఆరోపణలను తిప్పికొట్టిన నిరంజన్‌రెడ్డి

యాసంగి ధాన్యం కొనుగోళ్ల  చెల్లింపు అంశంపై తెరాస, భాజపా మధ్య రాజకీయ రగడ మొదలైంది. రైతులకు వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ రాశారు. ఈ లేఖపై మంత్రి నిరంజన్‌రెడ్డి  ఘాటుగా స్పందించారు. ‘బండి సంజయ్‌ తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుంది’’ అని మండిపడ్డారు.

3. ఈనెల 28 నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు

రైతుబంధు సాయం ఈనెల 28 నుంచి రైతులకు అందనుంది. వానాకాలం పెట్టుబడి సాయాన్ని ఈనెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఎప్పటి లాగే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను ప్రభుత్వం జమచేయనుంది.

4. తెలంగాణలో మరోసారి కరోనా విజృంభణ

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా  పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 27,754 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి ఈరోజు 129 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,680 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 292 కేసులు నమోదయ్యాయి.

5. ఏపీలో లక్ష మంది ‘అమ్మఒడి’కి దూరం

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 27న అమ్మఒడి పథకం నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమచేయనుంది. ఈ పథకంలో ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష మందికిపైగా కోత పెట్టింది. పాఠశాలలకు గైర్హాజరు కావడంతో 51 వేల మందిని ప్రభుత్వం అనర్హులుగా తేల్చింది. వేర్వేరు కారణాలతో మరో 50 వేల మందికి అమ్మఒడి నిలిపివేసింది.

6. తెదేపా నేత అయ్యన్న ఇంటి గోడ నిర్మాణానికి హైకోర్టు అనుమతి

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. డ్రైనేజీ భూమిని ఆక్రమంచి ఇంటి గోడ నిర్మించారని పేర్కొంటూ మున్సిపల్‌ అధికారులు ఆయన ఇంటి గోడను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇంటి గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్‌, రాజేష్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

7. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ 2022 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్‌ మెయిన్స్‌కు మొత్తం 13,090 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సెప్టెంబర్‌ 16 నుంచి 21 వరకు సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

8. నిర్మాతలెవరూ వ్యక్తిగత నిర్ణయం తీసుకోవద్దు: ఫిల్మ్‌ ఛాంబర్‌

వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికుల చేపట్టిన నిరసన, దానికి నిర్మాతల మండలి సమాధానంపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి స్పందించింది. ఈ మేరకు నిర్మాతలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి 15 రోజులపాటు పాత పద్ధతిలోనే సినీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని సూచించింది. ఫిల్మ్ చాంబర్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ కార్మికులకు వేతనాలు చెల్లించవద్దని కోరింది.

9. గ్యాంగ్‌ రేప్‌ కేసు.. మైనర్ల బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ

జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నలుగురు మైనర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను జువైనల్‌ జస్టిస్‌ బోర్డు తిరస్కరించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసులు చేసిన వాదనతో జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఏకీభవిస్తూ బెయిల్‌ పిటిషన్లు తిరస్కరించింది. 23న మరో మైనర్ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

10. పూర్తిగా కోలుకోలేదు.. మరింత సమయం ఇవ్వండి: సోనియా

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా తన హాజరుకు కొన్ని వారాల పాటు మినహాయింపు ఇవ్వాలని ఆమె దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని