Heart Attack: నవరాత్రుల్లో విషాదం.. గుండెపోటుతో 10మంది మృతి!

 గర్బా నృత్యం చేసిన నేపథ్యంలో గుజరాత్‌లో వేర్వేరు చోట్ల 10మందికి పైగా మృతిచెందడం కలకలం రేపుతోంది.

Updated : 22 Oct 2023 23:05 IST

అహ్మ‌దాబాద్ : నవరాత్రుల వేళ గుజ‌రాత్‌లో (Gujarat) చోటుచేసుకుంటున్న గుండెపోటు ఘటనలు తీవ్ర విషాదం నింపుతున్నాయి. పండగ వేళ ఎంతో ఉత్సాహంగా చేసే సంప్రదాయ గర్బా నృత్యంలో పాల్గొన్నవారిలో పలువురు గుండెపోటుకు గురై అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో గుజరాత్‌లోని పలుచోట్ల 10 మందికి పైగా గుండెపోటుతో మృతిచెందినట్టు సమాచారం. బాధితుల్లో టీనేజర్ల నుంచి మధ్య వయసు వారూ ఉన్నారు. 

గర్బా నృత్యం చేస్తూ ఖేడా జిల్లాలోని క‌ప‌ద్వంజ్‌లో 17 ఏళ్ల యువకుడు వీర్‌ షా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. గర్బా ఆడుతుండగా అతడి ముక్కు నుంచి రక్తం కారడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో వేరే చోట వేడుకల్లో ఉన్న అతడి తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి ఆస్పత్రికి వెళ్లగా.. యువకుడు గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, తన కుమారుడికి జరిగినట్టుగా ఇంకెవరికీ జరగకూడదన్న ఉద్దేశంతో యువకుడి తండ్రి రాయ్‌పాల్‌ షా ఆ పెను విషాదాన్ని దిగమింగుకొని ఓ విజ్ఞప్తి చేశాడు. 

కొడుకును పోగొట్టుకున్నా.. ఇంకెవరికీ అలా జరగకూడదని..!

‘‘చేతులు జోడించి వేడుకొంటున్నా. దయచేసి అప్రమత్తంగా ఉండండి. విరామం తీసుకోకుండా ఎక్కువ సేపు గర్బా ఆడొద్దు. నేను నా కొడుకును పోగొట్టుకున్నాను. మరెవరికీ అలా జరగకూడదని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ ఘటనతో నిర్వాహకులు మరుసటి రోజు గర్బా ఈవెంట్‌ను రద్దు చేశారు. కపంద్వాజ్‌లోని వేర్వేరు చోట్ల కూడా నిర్వాహకులు ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

వడోదర జిల్లాలో 13 ఏళ్ల బాలుడు.. 

గుజరాత్‌లో ఇదే తరహా ఘటనలు అహ్మదాబాద్‌, నవ్సారి, రాజ్‌కోట్‌లలోనూ చోటుచేసుకున్నాయి. వడోదర జిల్లాలోని దభోయిలో 13 ఏళ్ల బాలుడు గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో మృతిచెందాడు. వైభవ్‌ సోనీ(13) అనే బాలుడు గర్బా ఆడి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా కింద పడిపోయాడు. స్వల్ప గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత బాలుడికి ఛాతీలో నొప్పి రావడంతో మందులు వేసి నిద్రపుచ్చారు. కొన్ని గంటల తర్వాత నిద్ర లేపగా.. కళ్లు తెరవలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మరోసారి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, గర్బా నృత్యం కారణంగానే గుండె పోటు వచ్చిందా?అనే విషయాన్ని వైద్యులు ధ్రువీకరించలేదు. 

మరోవైపు, నవరాత్రులు ప్రారంభమైనప్పట్నుంచి గుండె సంబంధిత సమస్యలతో 108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌ సర్వీసులకు 24గంటల్లో 500లకు పైగా కాల్స్‌ వచ్చినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గుండెపోటు ఘటనలు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు అప్రమత్తంగా ఉండాలని గుజరాత్‌ ప్రభుత్వం సూచించింది. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని గర్బా ఈవెంట్‌ నిర్వాహకులను కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని