Taylor Swift: పాప్‌స్టార్‌పై అభిమానం.. వందకు పైగా కొవిడ్‌ కేసులకు కారణం!

ఓ పాప్‌స్టార్‌పై అభిమానంతో వందల సంఖ్యలో అభిమానులు ఒకచోట గుమిగూడి నిర్వహించిన కార్యక్రమం.. పెద్దఎత్తున కొవిడ్‌ కేసులకు కారణమైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇది చోటుచేసుకుంది. ప్రముఖ పాప్‌ సింగర్ టేలర్‌ స్విఫ్ట్‌ ఇటీవల 'రెడ్ (టేలర్‌ వెర్షన్)' అల్బమ్‌..

Updated : 20 Dec 2021 01:32 IST

కాన్‌బెర్రా: ఓ పాప్‌స్టార్‌పై అభిమానంతో వందల సంఖ్యలో అభిమానులు ఒకచోట గుమిగూడి నిర్వహించిన కార్యక్రమం.. పెద్దఎత్తున కొవిడ్‌ కేసులకు కారణమైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ పాప్‌ సింగర్ టేలర్‌ స్విఫ్ట్‌ ఇటీవల 'రెడ్ (టేలర్‌ వెర్షన్)' అల్బమ్‌ విడుదల చేయడంతో దీన్ని వేడుక చేసుకునేందుకు వందల సంఖ్యలో అభిమానులు డిసెంబర్‌ 10న సిడ్నీలోని ఓ థియేటర్‌లో భారీ ఈవెంట్‌ నిర్వహించారు. వారం రోజుల తర్వాత వీరిలో దాదాపు 100 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఈ కేసులు బయటపడటం స్థానికంగా కలకలం రేపుతోంది.

టెస్టులు చేయించుకోవాలని ఆదేశాలు..

ఒకే కార్యక్రమానికి సంబంధించి పెద్దమొత్తంలో కేసులు బయటపడటంతో.. న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య విభాగం అప్రమత్తమైంది. ఈ కార్యక్రమానికి హాజరైనవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది. దీంతోపాటు వారం రోజులు ఐసొలేషన్‌లో ఉండాలని సూచించింది. ఈ వేడుకకు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ప్రవేశం పొందిన దాదాపు 600 మందిని ఎన్‌ఎస్‌డబ్ల్యూ ఆరోగ్య విభాగం అత్యవసరంగా సంప్రదిస్తోంది. ఇతర మార్గాల్లో ప్రవేశించినవారూ టెస్టులు చేయించుకోవాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘించినవారు భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు.. టేలర్‌ స్విఫ్ట్‌ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని