Updated : 08/12/2020 18:26 IST

భారత్‌ బంద్ ప్రశాంతం

 రాత్రి 7గంటలకు రైతులను చర్చలకు ఆహ్వానించిన అమిత్‌ షా  

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు గంటల పాటు బంద్‌ పాటించారు. ఈ బంద్‌కు మద్దతుగా రహదారులపై బైఠాయించిన రైతులు, వారి మద్దతుదారులు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు.  రైతుల ఆందోళనకు మద్దతుగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఒకరోజు నిరాహారదీక్షకు దిగగా.. సాగు చట్టాలను రద్దు చేయాలని శిరోమణి అకాలీదళ్‌ వ్యవస్థాపకుడు ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ ప్రభావం కొన్ని రాష్ట్రాల్లోనే కనిపించింది. ఆయా రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ధర్నాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు, ప్రదర్శనలతో నిరసనకారులు కదం తొక్కారు. గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం పెద్దగా కనబడలేదు. 

‘భారత్‌ బంద్’ లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు
భారత్‌ బంద్‌ నేపథ్యంలో దిల్లీ సరిహద్దులో కేంద్ర బలగాలను భారీగా మోహరించారు.  ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నిర్విరామంగా కొనసాగిన ఈ బంద్‌లో రైతు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాలతో పాటు పలువురు పాల్గొన్నారు. తాము పిలుపునిచ్చిన బంద్‌ను ప్రశాంతంగా నిర్వహించిన అందరికీ రైతు సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి.  మరోవైపు, దిల్లీలో పలు రహదారులపై రాకపోకలు ఇప్పుడిప్పుడే అనుమతిస్తున్నారు. మరోవైపు, రైతు సంఘాలు మాత్రం తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ బంద్‌ను విజయవంతం చేసి కేంద్రానికి హెచ్చరిక పంపామని, సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ చేస్తోన్న తమ డిమాండ్లు ఎంత న్యాయపరమైనవో చెప్పేందుకు నేటి భారత్‌ బంద్‌కు లభించిన మద్దతే నిదర్శనమని రైతు నేతలు పేర్కొన్నారు.  

భారత్‌ బంద్‌ ముగిసినప్పటికీ తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని రైతు సంఘాల నేతలు స్పష్టంచేస్తున్నారు. కేంద్రం దిగి వచ్చి కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని పట్టుబడుతున్నారు. సవరణలతోనే సరిపెడతామంటే ఊరుకొనేది లేదని తేల్చిచెబుతున్నారు.

రాత్రి 7గంటలకు అమిత్ చర్చలకు ఆహ్వానం
మరోవైపు, గత 13 రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలు, నేటి భారత్‌ బంద్‌ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ రోజు రాత్రి 7గంటలకు రైతులను చర్చలకు ఆహ్వానించారు. అయితే, ఇటవల జరిగిన ఐదో విడత చర్చల్లో రైతు సంఘాల నేతలు చట్టాల్లో సవరణలకు ససేమిరా అనడంతో నిర్మాణాత్మక ప్రతిపాదనలతో మరోసారి ముందుకొస్తామని కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ చెప్పారు. రైతులతో ఆందోళనలు విరమించడమే లక్ష్యంగా ఈ నెల 9న మరోసారి చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి అమిత్‌ షా చర్చలకు ఆహ్వానించడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అమిత్‌ షా ఆహ్వానంపై రైతు సంఘాల నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

పంజాబ్‌లో బంద్ సంపూర్ణం
రైతు ఆందోళనలకు కేంద్రబిందువుగా ఉన్న పంజాబ్‌లో బంద్‌ సంపూర్ణంగా కొనసాగింది. వ్యాపార సంస్థలు, దుకాణాలు, విద్యా సంస్థలు, టోల్‌ప్లాజాలు మూతపడ్డాయి. ప్రజారవాణా స్తంభించింది. అమృత్‌సర్‌, మొహాలీ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ శ్రేణులతో పాటు  రైతు, కార్మిక సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా దిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టు వద్ద అఖిలభారత న్యాయవాదుల సంఘం ఆందోళన చేపట్టింది. సరోజినీ నగర్‌ మార్కెట్లో వర్తకులు నల్లరిబ్బన్లు ధరించి రైతులకు సంఘీభావం తెలిపారు.
Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని