కృష్ణపట్నంలో పారిశ్రామిక కారిడార్‌

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సహా కర్ణాటకలోని తుమకూరులో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ హబ్‌ అండ్‌ మల్టీ మోడల్‌......

Published : 30 Dec 2020 16:52 IST

రూ.2,139 కోట్లతో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

దిల్లీ: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సహా కర్ణాటకలోని తుమకూరులో పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ హబ్‌ అండ్‌ మల్టీ మోడల్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ హబ్‌ ఏర్పాటుకు నిర్ణయించింది.  రూ.7,725 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయాలని కేబినెట్‌ తీర్మానించింది. వీటి వల్ల సుమారు 2.8 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. సమావేశం వివరాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జావడేకర్‌, ధర్మేంద్ర ప్రదాన్‌ మీడియాకు వెల్లడించారు. ఓడరేవు ఉన్న కృష్ణపట్నంలో రూ.2,139 కోట్లతో పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు కానుందని, దీనివల్ల సుమారు 98వేల ఉద్యోగాలు వస్తాయని జావడేకర్‌ తెలిపారు.

అలాగే, ఆకాశ్‌ క్షిపణి వ్యవస్థను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఏదైనా దేశం దరఖాస్తు చేసుకుంటే సత్వర అనుమతుల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. విదేశాలకు ఎగుమతి చేయబోయే ఆకాశ్ క్షిపణి వ్యవస్థ.. ప్రస్తుతం భారత దళాలు వినియోగిస్తున్న దానికంటే భిన్నంగా ఉంటుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగించే ఇథనాల్‌ ఉత్పత్తి కోసం కొత్తగా ఏర్పాటు చేయబోయే డిస్టిలరీలకు రూ.4,573 కోట్ల వడ్డీ రాయితీని అందించేందుకు తీర్మానించినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు. 2030 నాటికి సుమారు వెయ్యి కోట్ల లీటర్ల ఇథనాల్‌ అవసరం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి..
జనవరి 7వరకు బ్రిటన్‌కు విమానాలు బంద్‌
చైనాలోని ఆ గుహ.. ఇప్పుడో కృష్ణబిలం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని