కమలా హారిస్‌కు ఆ పిలుపంటే ఇష్టమట!

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీచేసేందుకు భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌కు అవకాశం లభించింది.

Updated : 13 Aug 2020 12:19 IST

తొలి ప్రచార ప్రసంగంలో భారతీయతను చాటిచెప్పిన వైనం

న్యూయార్క్‌: అమెరికాలో నవంబర్‌లో జరగనున్న ఉపాధ్యక్ష పదవికి పోటీచేసేందుకు భారత సంతతి మహిళ కమలా హారిస్‌కు అవకాశం లభించింది. అధ్యక్షపదవి రేసులో ఉన్న డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌, తమ పార్టీ తరపు ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె, తొలి ఉపన్యాసంలో తన భారతీయతను గురించి ప్రస్తావించి పలువురిని ఆకట్టుకున్నారు. అంతేకాకుండా తన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు.

తను ‘మోమలా’ అనే పిలుపును చాలా ఇష్టపడతానని 55 ఏళ్ల కమలా హారిస్‌ అన్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో నిలవటం నిస్సందేహంగా తన కెరీర్లో అతి గొప్పవిషయమని.. అయితే తమ వద్దే ఉంటున్న భర్త సంతానం కొలే, ఎల్లా తనను రోజూ ఆ విధంగా పిలవటం సంతోషాన్ని పంచుతుందని వివరించారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌ అయిన కమల, ‘‘మా తల్లి శ్యామలా గోపాలన్‌ భారత్‌కు చెందిన వారు కాగా, తండ్రి డొనాల్డ్‌ హారిస్ జమైకాకు చెందినవారు. ప్రపంచంలో భిన్న ప్రదేశాలకు చెందిన నా తల్లితండ్రులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చారు.  వారిని 1960 నాటి పౌరహక్కుల ఉద్యమం దగ్గరకు చేర్చింది. మా అమ్మ శ్యామల, అమెరికాలోని ప్రతి తరంవారు ముందుకు నడవాలనే ఆదర్శాన్ని నాకు, నా సోదరి మాయకు నేర్పింది. ఊరికే కూర్చుని రకరకాల అంశాలపై గురించి ఫిర్యాదులు చేసే కన్నా, ఏదో ఒకటి చేసి చూపాలని ఆమె మాకు ఎప్పుడూ చెప్పేవారు’’ అని వెల్లడించారు.

భారతీయ మూలాలున్న హారిస్‌ ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే.. అమెరికా ఉపాధ్యక్షురాలైన తొలి మహిళగా మాత్రమే కాకుండా, ఈస్థాయికి చేరిన భారతీయ మూలాలున్న తొలి వ్యక్తిగా కూడా చరిత్ర సృష్టించనున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు