వదినా..‘కిమ్‌ జోంగ్‌’ ఫైన్‌ కడతాడంట..! 

అద్భుతాలు తెలుసుకోవాలంటే ఉత్తరకొరియా వార్తలు చదవాల్సిందే.. అంటే అక్కడేదో అభివృద్ధి జరిగి ఆకాశానికి నిచ్చెనలేస్తున్నారని కాదు.. ఒక దేశం ఏ స్థాయి బానిసత్వంలో బతుకుతోందో తెలుసుకోవడానికి. అక్కడ నియంత మరణిస్తే.. ప్రజలు బలవంతగా అయినా రెండు కన్నీటి చుక్కలు రాల్చాల్సిందే.. నియంత సంతోషం కోసం ప్లెజర్‌

Updated : 28 Sep 2020 15:34 IST

 ఉత్తరకొరియా వార్తసంస్థ డీపీఆర్‌కే న్యూస్‌ సర్వీస్‌ బడాయి ట్వీట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అద్భుతాలు తెలుసుకోవాలంటే ఉత్తరకొరియా వార్తలు చదవాల్సిందే.. అంటే అక్కడేదో అభివృద్ధి జరిగి ఆకాశానికి నిచ్చెనలేస్తున్నారని కాదు.. ఒక దేశం ఏ స్థాయి బానిసత్వంలో బతుకుతోందో తెలుసుకోవడానికి. అక్కడ నియంత మరణిస్తే.. ప్రజలు బలవంతగా అయినా రెండు కన్నీటి చుక్కలు రాల్చాల్సిందే.. నియంత సంతోషం కోసం ప్లెజర్‌ గ్రూప్‌ల పేరుతో మహిళల జీవితాలు నాశనం కావాల్సిందే. అక్కడ కిమ్‌ కుటుంబాన్ని కాదంటే ప్రాణాల మీద ఆశ వదులు కోవాల్సిందే. చివరికి ఎటువంటి హెయిర్‌స్టైల్‌  చేయించుకోవాలో కూడా ఓ నిబంధనల పట్టిక ఏర్పాటు చేశారు. ఇంతగా ఆ దేశాన్ని ఉక్కు పిడికిలిలో బిగించిన పాలకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి ఆ దేశ వార్తా సంస్థ ఓ సంచలన ట్వీట్‌ చేసింది. 

‘‘దేశభక్తుడిగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన విధులను పాటిస్తారు. ఆయన అన్నిరకాల పన్నులు, ఫీజులు, అసెస్‌మెంట్లు, లెవీలు, జరిమానాలు చెల్లిస్తారు’’అని ట్వీటింది. కిమ్‌కు పన్నులు విధిస్తారా..? ఫైన్లు వేస్తారా..?ఈ ట్వీట్‌ చాలా అతిశయంగా అనిపించింది. ప్రజాస్వామ్యానికి పెద్దన్నలాంటి దేశాల్లోనే పాలకుడికి ఫైన్‌ వేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కిమ్‌ రాజ్యంలో ఆయనకు ఫైన్‌ వేయడం వంటివి ఊహిస్తేనే పరలోక యాత్రకు టికెట్‌ తెగుతుంది.

చిన్నపిల్లలకు ఇదో శిక్ష..

కొన్ని వారాల క్రితం ఉత్తరకొరియాలో ఒక ఆదేశం విడుదలైంది. ప్రీస్కూల్‌ దశలోని చిన్నపిల్లలు నిత్యం 90 నిమిషాలపాటు దేశపాలకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి తెలుసుకోవాలన్నది దాని సారాంశం. ఈ జీవోను కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ జారీ చేశారు. ఈ నిబంధనకు ‘గ్రేట్‌నెస్‌  ఎడ్యుకేషన్‌‌’ అని పేరుకూడా పెట్టారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియాకు చెందిన డైలీ ఎన్‌కే అనే పత్రిక ఆగస్టు 25న  పేర్కొంది. గతంలో ప్రీస్కూల్‌ పిల్లలకు 30 నిమిషాలు కిమ్‌ గురించి క్లాస్‌ ఉండేది. ఇప్పుడు దాన్ని మరోగంట పెంచారు. 

క్షమాపణలతో ఇటీవల వార్తల్లోకి..

దక్షిణ కొరియాకు చెందిన ఫిషరీ విభాగ అధికారి పొరబాటున సరిహద్దు జలాలను అతిక్రమించి ముందుకొచ్చాడని ఉత్తరకొరియా సైనికులు చంపేశారు. ఈ ఘటనపై కిమ్‌ దక్షిణ కొరియాకు క్షమాపణలు తెలిపారు. ఒక్కసారిగా కిమ్‌ క్షమాపణలు చెప్పడం దక్షిణ కొరియాను కూడా ఆశ్చర్యపర్చింది. 

ట్రంప్‌కు అక్టోబర్‌ సర్‌ప్రైజ్‌ ఉంటుందా..?

అక్టోబర్‌లో కిమ్‌-ట్రంప్‌ మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని దక్షిణ కొరియా వార్తసంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. దీంతోపాటు ఉత్తరకొరియా వ్యవహారాల నిపుణుడు జాన్‌ హెర్స్‌కోవిట్జ్‌ కూడా ఈ దశగా ప్రయత్నాలు జరగవచ్చని బ్లూమ్‌బెర్గ్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఇప్పటికే ట్రంప్‌తో చర్చలు జరగడం..అమెరికా గత పాలకులతో పోలిస్తే ట్రంప్‌ శాంతి చర్చలకు మొగ్గుచూపడం వంటి అంశాలపై కిమ్‌ సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు ట్రంప్‌ గెలుపునకు అనుకూలంగా ఉండేలా చర్యలు చేపట్టి.. అమెరికాతో బేరసారాలు చేయవచ్చని భావించడం కూడా దీనికో కారణంగా నిలిచింది. ఇదే జరిగితే.. ట్రంప్‌ దౌత్య విజయంగా ఎన్నికల్లో  ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలో భాగంగా కిమ్‌ సోదరి కిమ్‌ యోజోంగ్‌ వచ్చేనెల వాషింగ్టన్‌ పర్యటించవచ్చని జాన్‌ కథనంలో పేర్కొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని