పూజాదేవి.. తొలి మహిళా బస్సు డ్రైవర్‌

చదువుకోవాలని ఉన్నా ఆర్థిక స్థోమత సరిపోలేదు. ఉద్యోగం చేయాలంటే కనీస చదువు లేదు. కుటుంబ అవసరాల కోసం స్టీరింగ్‌ పట్టక తప్పలేదు. అయితేనేం దాన్నే కెరీర్‌గా మలుచుకుంది. పురుషులు మాత్రమే చేయగలరనే

Updated : 26 Dec 2020 16:56 IST

జమ్మూ: చదువుకోవాలని ఉన్నా ఆర్థిక స్థోమత సరిపోలేదు. ఉద్యోగం చేయాలంటే కనీస చదువు లేదు. కుటుంబ అవసరాల కోసం స్టీరింగ్‌ పట్టక తప్పలేదు. అయితేనేం దాన్నే కెరీర్‌గా మలుచుకుంది. పురుషులు మాత్రమే చేయగలరనే అపోహను తొలగిస్తూ డ్రైవర్‌ వృత్తిని ఎంచుకుంది. జమ్మూకశ్మీర్‌లో ప్రయివేటు బస్సు నడుపుతూ అక్కడ తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా రికార్డులకెక్కింది. ఆమే.. కథువాకు చెందిన పూజాదేవి. మరి ఆమె ఈ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టారు.. సమాజంలోకి అడ్డుగోడలను దాటుకుని ఎలా విజయం సాధించారో ఆమె మాటల్లోనే..

‘మాది జమ్మూకశ్మీర్‌లోని కథువా ప్రాంతం. చాలా పేద కుటుంబంలో పుట్టాను. మా నాన్న సన్నకారు రైతు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నన్ను చదవించలేకపోయారు. అయితే నాకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. అందుకే డ్రైవింగ్‌నే వృత్తిగా ఎంచుకోవాలనుకున్నా. తొలినాళ్లలో కారు నడిపేదాన్ని. కొన్ని రోజులు ఓ డ్రైవింగ్‌ స్కూల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశాను. టాక్సీలు కూడా నడిపా. కానీ బస్సు లేదా ట్రక్కు నడపాలనే, ప్రొఫెషనల్‌ డ్రైవర్‌గా మారాలనే కోరిక ఉండేది. అయితే అది అంత సులభమైన పని కాదని నాకు తెలుసు. బస్సు డ్రైవర్‌గా మారతానని చెప్పినప్పుడు నా భర్త, కుటుంబం.. అంతా వ్యతిరేకించారు. ఆడవాళ్లకి డ్రైవింగ్‌ సరైన వృత్తి కాదని అన్నారు. అయితే నేను చదువుకోలేదు కాబట్టి నాకు ఎక్కడా ఉద్యోగం రాదు. నా భర్త కూలీ. ఆర్థిక పరిస్థితుల వల్ల నేను తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేకపోయారు’.

‘అలా మా మేనమామ సాయంతో ట్రక్కు నడపడం నేర్చుకున్నా. ఆ తర్వాత హెవీవెహికల్స్ లైసెన్స్‌ తీసుకున్నా. బస్సు డ్రైవర్‌గా జమ్ము-కథువా బస్సు యూనియన్‌కు దరఖాస్తు చేసుకున్నా. వాళ్లు నామీద నమ్మకం ఉంచి డ్రైవర్‌గా చేర్చుకున్నారు. గత గురువారం తొలిసారి జమ్ము-కథువా మధ్య ప్రయాణికుల బస్సు నడిపా. ఆ ప్రయాణం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అంతేగాక, నాలో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బస్సు ఎక్కేప్పుడు ప్రయాణికులు నన్ను చూసి తొలుత ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత నన్ను ఎంతో మెచ్చుకున్నారు. నాకు ముగ్గురు పిల్లలు. చిన్నవాడు నన్ను వదిలి ఇంట్లో ఉండలేడు. అందుకే తనని కూడా బస్సులో వెంట తీసుకెళ్తున్నా’ అని పూజాదేవి చెప్పుకొచ్చారు. డ్రైవర్‌గా ఎందుకు మారారు అని ఎవరైనా అడిగితే.. ‘నేటి ఆడవాళ్లు యుద్ధ విమానాలే నడుపుతున్నారు. బస్సు నడిపితే తప్పేంటీ’ అని చిరునవ్వుతో పూజ సమాధానం చెబుతున్నారు. 

పూజాదేవి బస్సు నడుపుతున్న ఫొటోలు కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవి వైరల్‌ అయ్యాయి. దీంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఈమె ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘జమ్మూకశ్మీర్‌ తొలి మహిళా బస్సు డ్రైవర్‌ పూజాదేవి. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది’ అని కొనియాడారు. 

ఇవీ చదవండి..

మేయర్‌ ఆర్య!

నా పేరు సరబ్‌జీత్‌.. నేను ఈ దేశానికి రైతును


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు