Published : 28 Oct 2021 09:40 IST

IND Vs PAK: టీ20 మ్యాచ్‌పై వ్యాఖ్యల రగడ.. ఉపాధ్యాయిని సహా ఆరుగురి అరెస్ట్‌

జైపుర్‌/ఆగ్రా: ఇటీవల జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ టి-20 క్రికెట్‌ మ్యాచ్‌లో పాక్‌ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ పలువురు చేసిన అభ్యంతర వ్యాఖ్యలు ప్రకంపనాలు సృష్టిస్తూనే ఉన్నాయి. జాతి వ్యతిరేక వ్యాఖ్యలుచేసిన ఆరోపణలపై దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలు సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ-కశ్మీర్‌లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో... పాక్‌ విజయాన్ని స్వాగతిస్తూ వ్యాఖ్యలు చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ, ఆటలో ఒక జట్టుకు మద్దతు ప్రకటించడం ఎందుకు తప్పవుతుందని ప్రశ్నిస్తూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టులను పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా పలువురు జమ్మూ-కశ్మీర్‌ నాయకులు ఖండించారు. ముఫ్తీది తాలిబన్‌ మనస్తత్వమని, పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినవారికి జైలు తప్పదని జమ్మూ-కశ్మీర్‌ భాజపా అధ్యక్షుడు రవీందర్‌ రైనా విమర్శించారు.

కలెక్టరేట్‌ ముట్టడి, ఆందోళన.. 

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు విజయం నేపథ్యంలో వ్యాఖ్యలు చేసిన ఏడుగురిపై ఆగ్రా, బరేలి, బదౌన్, సీతాపుర్‌లో మొత్తం 5 కేసులు నమోదైనట్టు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకూ ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. వీరిలో ఆగ్రాలో ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్న ముగ్గురు కశ్మీర్‌ విద్యార్థులు కూడా ఉన్నారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యల క్రమంలో... రాజా బల్వంత్‌సింగ్‌ మేనేజ్‌మెంట్, టెక్నికల్‌ క్యాంపస్‌ యాజమాన్యం ఇప్పటికే వీరిని సస్పెండ్‌ చేసింది. ఈ ముగ్గురిపై ఐపీసీ 153ఎ (వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం), 515(1)(బి) (ఉద్దేశపూర్వకంగా ప్రజలను భయపెట్టడం), ఐటీ చట్టంలోని 66ఎఫ్‌ నిబంధన కింద పోలీసులు ఆరోపణలు నమోదు చేశారు! అయితే, కొన్ని సంఘాల నేతలు బుధవారం స్థానిక కలెక్టరేట్‌ను ముట్టడించి, సదరు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. దీనిపై కళాశాల డైరెక్టర్‌ డా.పంకజ్‌ గుప్తా మాట్లాడుతూ- ‘‘అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముగ్గురు విద్యార్థులను సస్పెండ్‌ చేశాం. అయినా, కొందరు కళాశాలకు మచ్చతెచ్చే ఉద్దేశంతో దురుద్దేశంతో ఆందోళన చేస్తున్నారు. కనీసం యాజమాన్యంతో సంప్రదించకుండానే మంగళవారం కళాశాలలోకి, వసతి గృహాల్లోకి చొచ్చుకువచ్చారు. ఇది ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. వారిపై చర్యలు తీసుకునేవరకూ విద్యా సంస్థలను మూసి ఉంచుతాం’’ అని ఆయన పేర్కొన్నారు.

అందరిలాగే భారత్‌పై నాకూ ప్రేమ ఉంది..

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ వాట్సప్‌లో అభ్యంతరకర స్టాటస్‌ పెట్టిన ప్రైవేటు ఉపాధ్యాయిని నఫీసాను రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ నఫీసా వీడియో విడుదల చేశారు. ‘‘వాట్సప్‌లో నాకు ఎవరో సందేశం పంపి పాకిస్థాన్‌కు మద్దతు పలుకుతావా? అని ఎమోజీలతో కూడిన ప్రశ్నను సరదాగా అడిగారు. దానికి నేను ‘అవును’ అంటూ అంతే సరదాగా బదులిచ్చాను. దానర్థం నేను పాకిస్థాన్‌కు నిజంగానే మద్దతు పలుకుతున్నట్టు కాదు’’ అని ఆమె పేర్కొన్నారు. నఫీసాను ఆమె పనిచేస్తున్న నీరజా మోదీ పాఠశాల యాజమాన్యం ఇప్పటికే తొలగించింది. 

శ్రీనగర్‌లో పోలీసుల అదుపులో మరో ఇద్దరు..

శ్రీనగర్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న పలువురు విద్యార్థులపై ‘ఉపా’ చట్టం కింద జమ్మూ-కశ్మీర్‌లోని సాంబా జిల్లా పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఇందులో తాజాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకూ పోలీసులు అరెస్టు చేసినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని