ఫైజర్‌ టీకా వినియోగానికి అమెరికా అనుమతి

కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా ప్రజలకు అక్కడి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే శుభవార్తను అందజేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతినిచ్చింది......

Updated : 12 Dec 2020 12:29 IST

వాషింగ్టన్‌: కరోనాతో అతలాకుతలమవుతున్న అమెరికా ప్రజలకు అక్కడి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే శుభవార్తను అందజేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు ఫైజర్‌ రూపొందించిన కరోనా టీకాకు అత్యవసర వినియోగం కింద అనుమతిస్తూ ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మహమ్మారికి ఇక అమెరికాలో అంతిమ గడియలు మొదలైనట్టేనని అంతా భావిస్తున్నారు. 

భద్రత, కరోనా నుంచి రక్షణ కల్పించే విషయంలో తమ టీకా మెరుగ్గా పనిచేస్తోందంటూ ఫైజర్‌ సమర్పించిన ప్రయోగ ఫలితాలతో ఎఫ్‌డీఏ నిపుణుల కమిటీ గురువారం సంతృప్తి వ్యక్తం చేసింది. టీకా అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని సిఫారసు చేసింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెనువెంటనే ఎఫ్‌డీఏ అనుమతులు జారీ చేసింది. దీంతో ఫైజర్‌ టీకాను అనుమతించిన ఆరో దేశంగా అమెరికా అవతరించింది. బ్రిటన్‌ తొలుత అనుమతులు జారీ చేయగా.. బహ్రైన్‌, కెనడా, సౌదీ అరేబియా, మెక్సికో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అనుమతులు రావడంతో టీకా పంపిణీ ఇప్పుడు ఓ పెద్ద సవాల్‌గా మారనుంది. ఇప్పటికే భారీ స్థాయిలో టీకా డోసులను కొనుగోలు చేసిన అమెరికాకు.. వాటిని నిల్వచేసి రవాణా చేయడం కత్తి మీద సాముగా నిలవనుంది. అందుకోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. పంపిణీ కోసం మాక్‌ డ్రిల్స్‌ కూడా నిర్వహించారు. తొలుత అందే మూడు మిలియన్ల డోసులను వైద్యారోగ్య, మిలిటరీ సిబ్బందితో పాటు వృద్ధులకు వారం రోజుల్లో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఒప్పందం ప్రకారం మార్చి నాటికి అమెరికాకు ఫైజర్‌ 100 మిలియన్‌ డోసుల్ని అందించాల్సి ఉంది. దేశ ప్రజలందరికీ టీకా ఉచితంగా అందజేస్తామని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం.. అమెరికాలో ఇప్పటి వరకు 1,58,34,965 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 2,95,182 మంది మహమ్మారికి బలయ్యారు. 

ఇవీ చదవండి..

కొవి షీల్డ్.. నెలకు 10 కోట్ల డోసులు

అత్యుత్తమ వ్యాక్సిన్‌ అందించే సత్తా భారత్‌కు ఉంది


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు