ఇప్పుడు చూడండి ఏమైందో..!

అసలు శ్వేతసౌధంలో కొవిడ్‌-19 కేసులను ముందే నివారించవచ్చని అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి వ్యాఖ్యానించారు. ఓ పక్క ట్రంప్‌ ఆసుపత్రి నుంచి వేగంగా శ్వేతసౌధానికి చేరుకోవడం.. అక్కడ మాస్క్‌ తీసి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వంటి విషయాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న

Published : 07 Oct 2020 11:32 IST

 ట్రంప్‌ను ఇరుకున పెట్టిన ఫౌచి

ఇంటర్నెట్‌డెస్క్‌: అసలు శ్వేతసౌధంలో కొవిడ్‌-19 కేసులను ముందే నివారించవచ్చని అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి వ్యాఖ్యానించారు. ఓ పక్క ట్రంప్‌ ఆసుపత్రి నుంచి వేగంగా శ్వేతసౌధానికి చేరుకోవడం.. అక్కడ మాస్క్‌ తీసి ఫొటోలకు పోజులు ఇవ్వడం వంటి విషయాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఫౌచి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటికే శ్వేత సౌధంలో ట్రంప్‌తో సహా మెలానియా, ఇతర సిబ్బంది కూడా కొవిడ్‌ బారిన పడ్డారు. పలువురు రిపబ్లికన్‌ పార్టీ సభ్యులకు కూడా ఇది సోకింది.

అమెరికన్‌ యూనివర్శిటీస్‌ కెన్నడీ పొలిటికల్‌ యూనియన్‌ ఇంటర్వ్యూలో ఫౌచి మాట్లాడారు. ‘కరోనా మహమ్మారి అభూత కల్పన అని నమ్మే మొండివారితో నివారణ చర్యల గురించి ఎలా చర్చించాలి’ అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దానికి ఫౌచి స్పందిస్తూ..‘‘ఈ వారం వైట్‌హౌస్‌ను చూడండి. అక్కడ జరుగుతున్నది వాస్తవం. ప్రతి రోజూ మరింత మంది కొవిడ్‌ బారిన పడుతుంటారు. ఇది అభూత కల్పన కాదు. ఇది దురదృష్టకర పరిస్థితి. అసలు ఇది చోటు చేసుకోకుండా ముందే నివారించవచ్చు’’అని అన్నారు. 

ముందే వారించినా..

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్ఫెక్షియస్‌ డీసీజెస్‌ డైరెక్టర్‌గా ఫౌచీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ట్రంప్‌ కార్యవర్గంతో కలిసి పనిచేశారు. మాస్క్‌లు ధరిస్తే వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవచ్చని మొదటి నుంచి చెబుతూవచ్చారు. ట్రంప్‌ మాత్రం ఫౌచీ సూచనలను ఏమాత్రం పట్టించుకోలేదు. అత్యంత అరుదుగానే ఫేస్‌మాస్క్‌ను ధరించేవారు. కొవిడ్‌ సోకి అసుపత్రిలో చికిత్స పొంది శ్వేత సౌధానికి వచ్చాక కూడా ట్రంప్‌ ఎక్కవసేపు మాస్కు ధరించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని