Raghav Chadha: ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా ర్యాంప్‌ వాక్‌.. ఫ్యాషన్‌ వీక్‌లో తళుక్కుమన్న నేత

ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా సరికొత్త అవతారంలో కన్పించారు. దిల్లీలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ఆయన షోస్టాపర్‌గా తళుక్కుమన్నారు.

Updated : 28 Mar 2022 11:58 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా సరికొత్త అవతారంలో కన్పించారు. దిల్లీలో జరుగుతోన్న లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ఆయన షోస్టాపర్‌గా తళుక్కుమన్నారు. డిజైనర్‌ పవన్‌ సచ్‌దేవ కోసం నటుడు అపర్‌శక్తి ఖురానాతో కలిసి ర్యాంప్‌ వాక్‌ చేసి అలరించారు. రాఘవ్‌ చద్దా ర్యాంప్‌పై కన్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సచ్‌దేవ్‌ డిజైన్‌ చేసిన లెదర్‌ జాకెట్‌ ధరించి వీక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రాఘవ్‌ చద్దా ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇటీవల పంజాబ్‌ నుంచి ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల్లో రాఘవ్‌ చద్దా కూడా ఒకరు. గతంలో దిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను పంజాబ్‌ ఎన్నికలకు కో-ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ విజయంలో చద్దా కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనను పార్టీ హైకమాండ్‌ రాజ్యసభకు పంపించింది. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఉన్న మెజార్టీతో ఆయన ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంతేకాదు, 33 ఏళ్ల చద్దా.. పెద్దల సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడు కావడం విశేషం.

ఇక దిల్లీలో ఐదు రోజుల పాటు జరిగిన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ ఆదివారంతో ముగిసింది. చివరి రోజు పలువురు బాలీవుడ్‌ తారలు ర్యాంప్‌పై హొయలొలికించారు. నటీమణులు అనన్య పాండే, కంగనారనౌత్‌, పూజా హెగ్దే, ఊర్వశీ రౌటెలా తదితరులు షోస్టాపర్లుగా సందడి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని