Air Force C17: లేహ్‌కు నిలిచిన విమాన సర్వీసులు

సాంకేతిక కారణాలతో లేహ్‌లోని విమానాశ్రయం రన్‌వేపై భారత వాయుసేనకు చెందిన విమానం నిలిచిపోయింది. ఒకటే రన్‌వే కావడంతో.. ఈ ఎయిర్‌పోర్టుకు విమాన రాకపోకలను రద్దు చేశారు.

Published : 16 May 2023 22:28 IST

లేహ్‌: కేంద్రపాలిత ప్రాంతమైన లద్ధాఖ్‌ (Ladakh)లోని లేహ్‌ విమానాశ్రయాని (Leh Airport)కి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. కారణం.. భారత వాయుసేన (Indian Air Force)కు చెందిన భారీ రవాణా విమానం ‘సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ (C-17 Globemaster)’.. అక్కడి రన్‌వేపై నిలిచిపోవడమే. ఇక్కడి కుశోక్‌ బకులా రింపోచే విమానాశ్రయం (Kushok Bakula Rimpochee Airport)లో ఒకటే రన్‌వే ఉంది. వాయుసేనకు చెందిన సీ-17 విమానం సాంకేతిక కారణాలతో దానిపై నిలిచిపోవడంతో.. ఇతర విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌లకు అవకాశం లేకుండా పోయింది. దీంతో లేహ్‌కు రావాల్సిన విమానాలను శ్రీనగర్‌, చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌లకు మళ్లించారు.

ముంబయి నుంచి లేహ్‌కు బయల్దేరిన తమ విమానాన్ని తిరిగి ముంబయికి మళ్లించారని ఓ వ్యక్తి ట్వీట్‌ చేశారు. దిల్లీ- లేహ్‌ విమానాన్ని తిరిగి దిల్లీకి మళ్లించినట్లు విస్తారా విమానయాన సంస్థ తెలిపింది. మరోవైపు లేహ్‌లోనూ పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు. సమస్య పరిష్కారమైన తర్వాత అదనపు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని వారు కోరినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారని, బుధవారం ఉదయం నాటికి రన్‌వే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. లేహ్‌ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విమానాశ్రయాల్లో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 3,256 మీ (10,682 అడుగులు) ఎత్తులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని