Ajit Pawar: తిరుగుబాటుకు ముందే.. శరద్‌ పవార్‌ను తొలగించాం..!: అజిత్‌ వర్గం

పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్సీపీ జాతీయాధ్యక్షుడు శరద్‌ పవార్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించినట్లు అజిత్‌ పవార్‌ వర్గం పేర్కొంది.

Published : 06 Jul 2023 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(NCP)లో చోటుచేసుకున్న సంక్షోభ పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్సీపీ జాతీయాధ్యక్షుడు శరద్‌ పవార్‌(Sharad Pawar)ను ఆ పదవి నుంచి తొలగించినట్లు అజిత్‌ పవార్‌(Ajit Pawar) వర్గం పేర్కొంది. తిరుగుబాటుకు రెండు రోజుల ముందే పార్టీ కొత్త అధ్యక్షుడిగా అజిత్‌ను ఎన్నుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి వెల్లడించినట్లు సమాచారం. ఇరు వర్గాలు ఎమ్మెల్యేల బల ప్రదర్శన జరిగిన కొన్ని గంటల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.

తమదే అసలైన ఎన్సీపీ అని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి అజిత్‌ పవార్‌ వర్గం లేఖ రాసింది. జూన్‌ 30న జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ను తొలగిస్తూ నూతన అధ్యక్షుడిగా అజిత్‌ పవార్‌ను ఎన్నుకున్నట్లు అందులో పేర్కొంది. అయితే, జూన్‌ 30న వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగినట్లు అజిత్‌ వర్గం పేర్కొనడాన్ని శరద్‌ పవార్‌ వర్గం తోసిపుచ్చింది. ఆ సమావేశానికి సంబంధించి పీసీ చాకో, సుప్రియా సూలే, జయంత్‌ పాటిల్‌, ఫౌజియా ఖాన్‌ వంటి కీలక నేతలకు సమాచారమే లేదని తెలిపింది. మరోవైపు, తిరుగుబాటు చేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ శరద్‌ పవార్‌ వర్గం నుంచి (జయంత్‌ పాటిల్‌) జులై 3న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఇక తమదే అసలైన పార్టీ అంటూ రెండుగా చీలిపోయిన వర్గాలు ఎమ్మెల్యేల బలప్రదర్శనకు దిగాయి. ఈ క్రమంలో అజిత్‌ పవార్‌ వర్గం సమావేశానికి 32 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని, శరద్ వర్గానికి 18 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారని ఆయా వర్గాలు ప్రకటించుకున్నాయి. అనంతరం అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలను ముంబయిలోని ఓ హోటల్‌కు తరలించింది. అయితే, తమకు మెజార్టీ సభ్యుల మద్దతు ఉందని అజిత్‌ వర్గం పేర్కొంటుండగా.. పార్టీ ఫిరాయింపు ముప్పు నుంచి బయటపడాలంటే మొత్తం 36 మంది సభ్యుల మద్దతు అవసరమని విశ్లేషకులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని