INDIA కూటమిలో అంతా ఓకే.. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది : అఖిలేశ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని.. సీట్ల సర్దుబాటు కూడా త్వరలోనే పూర్తవుతుందని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) పేర్కొన్నారు.

Published : 21 Feb 2024 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కలిసి పోటీ చేసే విషయంపై కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయని వచ్చిన ఊహాగాలను ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) తోసిపుచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందన్నారు. సీట్ల సర్దుబాటు కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)తోనూ ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

‘అంతా బాగానే ఉంది. కూటమి విషయానికొస్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో విపక్ష కూటమి కొనసాగుతుంది. మాలో ఎటువంటి విభేదాలు లేవు. త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు. మొరాదాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. రాహుల్‌ గాంధీ జోడో న్యాయ్‌ యాత్రలో ఎందుకు పాల్గొనడం లేదని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. వారం క్రితం ఇదే అంశంపై మాట్లాడిన అఖిలేశ్‌, రాష్ట్రంలో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చిన తర్వాతే రాహుల్‌ యాత్రలో పాల్గొంటానని చెప్పారు.

ప్రియాంక కీలక పాత్ర..?

ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌-ఎస్పీల మధ్య సీట్ల సర్దుబాటుపై జరిగిన సంప్రదింపులు ఫలించినట్లు తెలుస్తోంది. ఇందులో కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్‌ గాంధీతో చర్చించిన అనంతరం అఖిలేశ్‌ యాదవ్‌తో మాట్లాడినట్లు తెలిపాయి. మరోవైపు, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 17 లోక్‌సభ స్థానాలు ఆఫర్‌ చేసినట్లు సమాజ్‌వాదీ పార్టీ వెల్లడించింది. ఇదే విషయాన్ని ధ్రువీకరించిన కాంగ్రెస్‌.. ఏ సమయంలోనైనా సీట్లను ఖరారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. తాజాగా అఖిలేశ్‌ నుంచి సానుకూల స్పందన వచ్చిన నేపథ్యంలో దీనిపై రెండు పార్టీలు ఓ సంయుక్త ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని