Mansukh Mandaviya: కొవిడ్‌ రోగులు ఎక్కువగా శ్రమించొద్దు.. గుండెపోటు మరణాలపై కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకటన

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారు గుండెపోటు బారిన పడకుండా ఉండాలంటే రెండేళ్లపాటు ఒత్తిడితో కూడిన పనులకు దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సూచించారు.

Updated : 30 Oct 2023 14:20 IST

అహ్మదాబాద్‌: ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురై అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ (Mansukh Mandaviya) స్పందించారు. కొవిడ్‌-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నవారు తర్వాత ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. దీనివల్ల కార్డియాక్‌ అరెస్ట్‌ ముప్పు నుంచి బయటపడొచ్చని సూచించారు. ఈ మేరకు ఆయన భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధ్యయనాన్ని ఉదహరించారు. 

కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లో దసరా పండగ సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ పది మందికి పైగా మృతి చెందారు. ఈ మరణాలపై గుజరాత్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్‌ వైద్య నిపుణులు, కార్డియాలజిస్ట్‌లతో సమావేశం నిర్వహించారు. ఇందులో మన్‌సుఖ్‌ మాండవీయ కూడా పాల్గొన్నారు. ‘‘ఐసీఎమ్‌ఆర్‌ దీనిపై సమగ్ర అధ్యయనం నిర్వహించింది. వారి నివేదిక ప్రకారం కొవిడ్‌-19 కారణంగా తీవ్రంగా బాధపడిన వారు.. గుండెపోటు బారిన పడకుండా ఉండాలంటే.. కోలుకున్న తర్వాత రెండేళ్లపాటు ఒత్తిడితో కూడిన పనులు, పరిగెత్తడం, కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలి’’ అని మాండవీయ సూచించారు.

గుజరాత్‌లో నవరాత్రుల సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ ఖేడా జిల్లాలోని క‌ప‌ద్వంజ్‌లో 17 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఇదే తరహా ఘటనలు అహ్మదాబాద్‌, నవ్సారి, రాజ్‌కోట్‌లలోనూ చోటుచేసుకున్నాయి. వడోదర జిల్లాలోని దభోయిలో 13 ఏళ్ల బాలుడు, 28 ఏళ్ల యువకుడు, 55 ఏళ్ల వ్యక్తి గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో మృతిచెందినట్లు వార్తలొచ్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని