Kejriwal: మంత్రులకు ఉచిత విద్యుత్‌ ఇస్తుండగా.. సామాన్యులకు ఇస్తే తప్పేంటి..?

కేంద్ర మంత్రులకు ఉచిత విద్యుత్‌ ఇస్తుండగా.. సామాన్య ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే తప్పేంటని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

Published : 09 Aug 2022 01:48 IST

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌

దిల్లీ: ఉచిత పథకాలపై భాజపాకు (BJP), ఆమ్ఆద్మీ పార్టీకి (Aam Aadmi Party) మధ్య వార్‌ మొదలైనట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రులకు ఉచిత విద్యుత్‌ ఇస్తుండగా.. సామాన్య ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే తప్పేంటని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఉచిత విద్య, వైద్యం అందిస్తామంటూ కేజ్రీవాల్‌ చేసిన ప్రకటనపై భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. భాజపా నేతల విమర్శలకు దీటుగా బదులిచ్చారు.

‘కేవలం మంత్రులు మాత్రమే ఉచిత విద్యుత్‌ పొందాలా..? సామాన్యులకు ఎందుకు ఇవ్వరు. ఉచితంగా నీరు, ఉచిత విద్య ఇవ్వడంలో తప్పేంటి..? అని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత సేవలను కూడా ఉచిత పథకాలను చిత్రీకరించే ప్రయత్నం భాజపా చేస్తోందని విమర్శించారు. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించడంతోపాటు ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. వీటితోపాటు నిరుద్యోగులకు భృతి కూడా అందించాలన్నారు.

ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల మిత్రులకోసం రూ.10లక్షల కోట్లను మాఫీ చేశారని ఆరోపించిన కేజ్రీవాల్‌.. అప్పులు చెల్లించలేని వారిని ద్రోహులుగా ప్రకటించి, వారిపై దర్యాప్తు జరపాలి. అంతేకానీ, వారికి మద్దతు పలకడమేంటని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా భాజపాను దోస్త్‌వాద్‌ (Dostvaad), కాంగ్రెస్‌ పార్టీని పరివార్‌వాద్‌గా (Parivarvaad) అభివర్ణించిన ఆయన.. ఒకపార్టీ తన మిత్రుల కోసం పనిచేస్తుండగా, మరోపార్టీ కుటుంబ పాలనలో మునిగిపోయిందని విమర్శించారు. తమ పార్టీ మాత్రం కేవలం భారతీయుల (Bharatvaad) శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్‌ ఉద్ఘాటించారు. ఉచిత పథకాల పేరుతో ఓటర్లను మభ్యపెట్టే వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ సీఎం ఈ విధంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని