West Bengal: బర్త్‌డే పార్టీలో బాలికపై హత్యాచారం.. తృణమూల్‌ నేత కుమారుడి అరెస్ట్‌

ఓ పుట్టిన రోజు పార్టీలో బాలికపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

Published : 11 Apr 2022 13:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ పుట్టిన రోజు పార్టీలో బాలికపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన పంచాయతీ సభ్యుడి కుమారుడే కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారు. 

గత సోమవారం మధ్యాహ్నం నిందితుడి ఇంట్లో జరిగిన బర్త్‌డే పార్టీకి బాలిక హాజరైంది. కానీ, ఆమె తీవ్ర అనారోగ్యంతో ఇంటికి వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ ‘‘ టీఎంఎసీ నేత ఇంట్లో జరిగిన పార్టీ నుంచి వచ్చిన తర్వాత మా కుమార్తె తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావంతో విలవిల్లాడిపోయింది. వెంటనే మేం ఆసుపత్రికి తరలిచాం. ఆమె అక్కడ మరణించింది. ఆ పార్టీలో పాల్గొన్నవారిని అక్కడ ఏం జరిగిందని మేం ప్రశ్నించాం. వారు చెప్పిన దాని ప్రకారం మా కుమార్తెపై టీఎంసీ నేత కుమారుడు, అతడి మిత్రులు సామూహిక అత్యాచారం జరిపినట్లు తెలిసింది. మా కుమార్తె మరణించిన తర్వాత డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకోకముందే.. కొందరు వ్యక్తులు ఆమె మృతదేహాన్ని బలవంతంగా అంతిమ సంస్కారాలకు తరలించారు’’ అని ఆరోపించారు.

ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా స్పందించారు. పిల్లలు, మహిళలపై దాడులకు పాల్పడేవారిని తమ పార్టీ ఏమాత్రం సహించదని పేర్కన్నారు. ‘‘ఈ ఘటనపై రాజకీయాలు చేయవద్దు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులకు శిక్షపడేలా అన్ని చర్యలు తీసుకొంటారు’’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష భాజపా స్పందించి.. హంసాలీలో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని