లాలూ వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. సోషల్‌ మీడియాలో భాజపా ‘మోదీ కా పరివార్‌’ ప్రచారం

ప్రధాని మోదీ(Modi)ని ఉద్దేశించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav) చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలంతా ఏకమయ్యారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు అండగా నిలిచారు. 

Updated : 04 Mar 2024 16:15 IST

దిల్లీ: భాజపా నేతల ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాల్లో ఇప్పుడు ‘‘మోదీ కా పరివార్‌’’(Modi Ka Parivar) అనే పదం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ (Lalu Prasad Yadav) చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?

బిహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ చేపట్టిన ‘జన విశ్వాస యాత్ర’లో ఆయన తండ్రి లాలూ(Lalu Prasad Yadav) మాట్లాడుతూ ప్రధాని మోదీ(PM Modi) పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధానికి కుటుంబం లేదు. అందుకే వారసత్వ, కుటుంబ రాజకీయాలపై  విమర్శలు చేస్తున్నారు’’ అని అన్నారు. దీనికి భాజపా(BJP) నేతలు ఎక్స్‌ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ వంటి అగ్రనేతలతో సహా పలువురు తమ ఖాతాల్లో ‘‘మోదీ కా పరివార్‌’’ అనే పదాన్ని జోడించారు. తామంతా మోదీ కుటుంబమే అంటూ ఆయనకు అండగా నిలిచారు.

‘ఈ దేశమంతా నా కుటుంబమే’: లాలూ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్‌

2019 ఎన్నికల ముందు కూడా ఈతరహాలో భాజపా నేతలు స్పందించారు. అప్పట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..‘కాపలాదారు ఓ దొంగ’ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్‌గా కమలం పార్టీ నేతలంతా ‘మై భీ చౌకీదార్‌’(మేం కూడా కాపలాదారులం) అంటూ తమ సోషల్ మీడియా బయోల్లో మార్పులు చేశారు.

ఇదిలాఉంటే లాలూ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని స్పందించిన సంగతి తెలిసిందే. ‘‘140 కోట్ల మంది భారతీయులు నా కుటుంబమే. కోట్లాది మంది తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు.. వీరంతా నా కుటుంబసభ్యులే. దేశంలోని ప్రతీ పేద వ్యక్తీ నా కుటుంబమే. ఎవరూ లేనివారికి మోదీ ఉన్నారు. మోదీకి వారంతా ఉన్నారు. ‘మేరా భారత్‌ - మేరా పరివార్‌’ అనే భావనతోనే నేను జీవిస్తున్నా’’ అంటూ దీటుగా బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని