Yogi Adityanath: యోగి పట్టాభిషేకం.. అతిథులుగా బాలీవుడ్‌ సెలబ్రిటీలు.. బిజినెస్‌ లీడర్స్‌

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లఖ్‌నవూలోని ఎకానా స్టేడియంలో

Published : 24 Mar 2022 16:30 IST

హాజరుకానున్న ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ బృందం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లఖ్‌నవూలోని ఎకానా స్టేడియంలో వరుసగా రెండోసారి ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా వస్తుండగా.. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్ సెలబ్రిటీలు అక్షయ్‌ కుమార్‌, కంగనా రనౌత్‌, అజయ్‌ దేవగణ్‌, బోనీ కపూర్‌తో పాటు ఇటీవల సంచలన విషయం సాధించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్‌, ఆ చిత్రబృందం ప్రత్యేక అతిథులుగా ప్రమాణస్వీకారానికి రానున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. ఇక పలువురు వ్యాపార దిగ్గజాలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఎన్‌. చంద్రశేఖరన్‌, ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, గౌతమ్‌ అదానీ, ఆనంద్‌ మహీంద్రా, సంజీవ్‌ గొయెంకా తదితర పారిశ్రామిక ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో కొందరు ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

వీరితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. 13 అఖాడాల ప్రతినిధులు, ప్రయాగ్‌రాజ్‌ నుంచి 500 మంది ప్రత్యేక అతిథులు రానున్నట్లు సమాచారం. మొత్తం 20వేల మంది ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. 

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా రెండోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ సరికొత్త చరిత్ర లిఖించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని