సీరం నుంచి బ్రిటన్‌కు కోటి డోసులు!

భారత్‌లో ఉత్పత్తి అవుతోన్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కోటి డోసులను సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించింది.

Published : 04 Mar 2021 01:13 IST

లండన్‌: భారత్‌లో ఉత్పత్తి అవుతున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కోటి డోసులను సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం వెల్లడించింది. బ్రిటన్‌ అవసరాల కోసం ఆస్ట్రాజెనెకా నుంచి పది కోట్ల డోసులను ఆర్డర్‌ చేయగా, వీటిలో కోటి డోసులు భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటామని పేర్కొంది. ‘కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పంపిణీ దృష్ట్యా ఇప్పటికే 10 కోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ డోసులను ఆర్డర్‌ చేశాం. వీటిలో కోటి డోసులు భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి దిగుమతి చేసుకుంటాం’ అని బ్రిటన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ 2 కోట్ల 13లక్షల డోసులను పంపిణీ చేసింది. ఇజ్రాయెల్‌, యూఏఈ తర్వాత అత్యధిక శాతం ప్రజలకు టీకా అందించిన దేశాల్లో బ్రిటన్‌ మూడో స్థానంలో ఉంది.

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే భారత్‌కు సరఫరా చేయడంతో పాటు విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతిని ముమ్మరం చేసింది. ఇప్పటివరకు దాదాపు 40దేశాలకు భారత్‌ నుంచి వ్యాక్సిన్‌ ఎగుమతి చేస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ నుంచి బ్రెజిల్‌ వంటి స్వల్ప, మధ్య ఆదాయ దేశాలు కొవిడ్ వ్యాక్సిన్‌ కోసం భారత్‌పైనే ఆధారపడ్డాయి. ఆయా దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని ‘కొవాక్స్‌’కు కూడా సీరం ఇన్‌స్టిట్యూట్‌ వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని