BSF: కన్నతండ్రి కడచూపునకు అవకాశం కల్పించి.. మానవత్వాన్ని చాటుకుని!

భారత్‌లో చనిపోయిన తండ్రి చివరి చూపునకు బంగ్లాదేశ్‌లో నివసిస్తోన్న ఆయన కుమార్తెకు అవకాశం కల్పించి.. ‘బీఎస్‌ఎఫ్‌’ మానవత్వాన్ని చాటుకుంది.

Published : 30 Dec 2023 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి సాధారణంగా సైనిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక పనుల కట్టడి చర్యలే కనిపిస్తుంటాయి. కానీ, ఇందుకు భిన్నంగా భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దు (India- Bangladesh Border) వద్ద హృదయాన్ని ద్రవింపజేసే సన్నివేశం ఆవిష్కృతమైంది. భారత భూభాగంలో చనిపోయిన తన తండ్రి చివరి చూపు కోసం బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న కుమార్తె తల్లడిల్లిపోగా.. భారత సరిహద్దు దళం (BSF) మానవత్వాన్ని చాటుకుంది. బంగ్లా అధికారులను సంప్రదించి.. జీరో లైన్‌ (Zero Line) వద్ద ఆమె తన తండ్రిని కడసారి చూసేందుకు అవకాశం కల్పించింది.

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాలు జిల్లా హరిహర్‌పుర్‌కు చెందిన లియాకత్‌ బిస్వాస్‌ అనే వ్యక్తి ఇటీవల మృతి చెందారు. అయితే.. ఆయన కుమార్తె, బంధువులు సరిహద్దుకు అవతల బంగ్లాదేశ్‌లో నివసిస్తున్నారు. మృతుడి గ్రామస్థులు ఇదే విషయాన్ని బీఎస్‌ఎఫ్‌ దక్షిణ బెంగాల్ ఫ్రాంటియర్‌కు చెందిన 68వ బెటాలియన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అంత్యక్రియలకు ముందు చివరి చూపునకు వారికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే మానవత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకున్న మధుపుర్‌లోని బార్డర్‌ ఔట్‌పోస్ట్‌ కమాండర్‌ వెంటనే బంగ్లాదేశ్‌ భద్రతా అధికారులను సంప్రదించారు.

కౌన్సిలర్ల మధ్య కొట్లాట.. వచ్చేటప్పుడు సెక్యూరిటీ తెచ్చుకుంటే బెటరేమో..!

బంగ్లా వైపు నుంచీ సానుకూల స్పందన రావడంతో.. రెండు దేశాల సరిహద్దు బలగాలు కలిసి ‘జీరో లైన్‌’ వద్ద ఈ మేరకు ఏర్పాట్లు చేశాయి. దీంతో లియాకత్‌ కుమార్తె, బంధువులు.. ఆయన మృతదేహాన్ని సందర్శించి, కన్నీటి నివాళులర్పించారు. ‘‘దేశ భద్రతకు పాటుపడటమే కాకుండా.. సరిహద్దు ప్రజల కష్టసుఖాల్లోనూ బీఎస్‌ఎఫ్‌ పాలుపంచుకుంటుంది. స్థానికుల మత, సామాజిక విలువలను కాపాడుతుంది. దురుద్దేశపూరిత వ్యక్తులకు మాత్రమే మేం వ్యతిరేకం. మానవత్వం, విలువల విషయానికి వస్తే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని