కెనడా ఉత్తర్వు.. సీసీఐలో గూగుల్‌పై DNPA పోరాటానికి చేయూత

ఆన్‌లైన్‌ వార్తల మార్కెట్లో సెర్జింజన్‌ దిగ్గజం గూగుల్‌ గుత్తాధిపత్యం, దుర్వినియోగంతో తాము భారీగా నష్టపోతున్నామంటూ భారత్‌లోని పలు ప్రఖ్యాత......

Updated : 10 May 2022 18:23 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ వార్తల మార్కెట్‌లో సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ గుత్తాధిపత్యం, దుర్వినియోగంతో భారీగా నష్టపోతున్నామంటూ భారత్‌లోని పలు ప్రఖ్యాత వార్తా సంస్థల ఫిర్యాదులపై భారత కాంపిటేషన్‌ కమిషన్‌ (సీసీఐ) విచారణకు ఆదేశించిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డిఎన్‌పిఎ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూగుల్‌ గుత్తాధిపత్య దోపిడీపై సీసీఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కెనడాలో వచ్చిన ఉత్తర్వులు మన దేశంలోని మీడియా సంస్థల పోరాటానికి గొప్ప ప్రోత్సాహాన్నిచ్చేదిగా ఉంది. దేశంలో డీఎన్‌పీఏలో భాగంగా ఉన్న ప్రముఖ వార్తా పత్రికలు, డిజిటల్‌ ఎడిషన్‌లు గూగుల్‌ తమకు చెల్లింపుల విషయంలో అన్యాయం చేయడంపై కొన్నాళ్లుగా రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. వార్తా పత్రికలు, డిజిటల్ ఎడిషన్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న కంటెంట్‌పై గూగుల్‌ సంస్థ భారీ మొత్తంలో ప్రకటనల ద్వారా ఆదాయాలను అర్జిస్తోంది. అయితే, వార్తాల ప్రచురణకర్తలకు న్యాయమైన చెల్లింపులు చేయడంలో, ఆదాయం పంపిణీలో మాత్రం పక్షపాతంతో వ్యవహరిస్తోంది. దీంతో భారత్‌లోని వార్తల ప్రచురణకర్తలకు భారీగా నష్టపోతున్నారు. దీంతో అనేక  ప్రజాస్వామిక దేశాల్లోని ప్రచురణకర్తలు, ప్రభుత్వం గూగుల్‌ చేస్తోన్న ఈ దోపిడీపై పోరాడుతున్నాయి. తమ కంటెంట్‌పై గూగుల్‌ ఆర్జిస్తున్న ఆదాయంలో తమ వాటా చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో వచ్చిన తాజా ఉత్తర్వులు భారత్‌ సహా ఇతర ప్రపంచ దేశాల్లో గూగుల్‌ గుత్తాధిపత్యానికి వ్యతిరేక పోరాటాలకు మరింత బలాన్నిచ్చేవిగా ఉన్నాయి.

కెనడాలో డిజిటల్‌ న్యూస్‌ మార్కెట్లో గూగుల్‌ వంటి మధ్యవర్తుల్ని నియంత్రించే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ న్యూస్‌ యాక్ట్‌ను రూపొందించారు. వార్తా సంస్థలతో బేరసారాల్లో అసమానతలు లేకుండా ఉండేలా రూల్స్‌ తీసుకొచ్చారు. మార్కెట్‌లో గూగుల్‌ వంటి న్యూస్‌ అగ్రిగేటర్స్‌ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారా లేదా అనే నిర్దిష్ట అంశాలపై ఆధారపడి ఇది ఉంటుంది. అలాగే, మధ్యవర్తి ద్వారా అందుబాటులోకి తెచ్చిన వార్తల కోసం వార్తా వ్యాపారాలకు న్యాయమైన పరిహారం అందించే నిబంధనలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత నిబంధన ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి ఫ్లాట్‌ఫాంలు వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు వార్తా ప్రచురణ కర్తలకు వారి కంటెంట్‌కు న్యాయంగా చెల్లించేందుకు వీలుగా రూపొందించారు. కెనడాలోని ఆన్‌లైన్ న్యూస్ యాక్ట్ ప్రకారం.. డిజిటల్ వేదికలు వార్తా ప్రచురణకర్తలతో న్యాయమైన ఒప్పందం కుదుర్చుకోవడంలో అసమానతలు ఉంటే రెగ్యులేటర్‌ ద్వారా పరిశీలిస్తారు లేదా మదింపు వేస్తారు. ఒకవేళ అప్పటికీ ఒప్పందాలు కార్యరూపం దాల్చకపోతే  ఈ ప్లాట్‌ఫారమ్‌లు కెనడియన్ రేడియో-టెలివిజన్, టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ పర్యవేక్షించే ఆర్బిట్రేషన్‌ ప్రక్రియకు వెళ్లాల్సి ఉంటుంది.

గతేడాది ఆస్ట్రేలియా కూడా ఇలాంటి సంచలన చట్టాన్ని ఆమోదించిన విషయం గమనార్హం. అక్కడ కూడా గూగుల్, ఫేస్‌బుక్‌ సంస్థలు తమ వేదికల్లోని కంటెంట్‌ కోసం వాస్తవ వార్తా ప్రచురణకర్తలకు న్యాయమైన మొత్తాన్ని చెల్లించడాన్ని ఈ చట్టంలో తప్పనిసరి చేసింది. భారత్‌లో కూడా డీఎన్‌పీఏ కింద ఏర్పాటైన పలు మీడియా సంస్థలు ఇదే తరహా పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. డీఎన్‌పీఏ దాఖలు చేసిన ఫిర్యాదుపై సీసీఐ గూగుల్‌కు నోటీసులు జారీ చేసిన సమయంలో ఈ కెనడాలో ఈ ఆదేశాలు రావడం విశేషం. కెనడాలో వచ్చిన ఈ ఆదేశాలు.. మీడియా సంస్థలతో గూగుల్‌ నిష్పాక్షికంగా వ్యవహరించేలా.. నకిలీ వార్తలు, స్వాభావిక పక్షపాతం ద్వారా దేశాలకు నెగెటివ్‌గా ప్రచారం చేసేలా గ్లోబల్‌ సెర్చింజన్లు మార్చగలిగే పరిస్థితులున్న ప్రస్తుత కాలంలో మన మీడియా వృద్ధికి, వాస్తవిక వార్తల ప్రసారాన్ని పెంపొందించేందుకు చట్టాలు రూపొందించేందుకు భారత న్యాయ నిర్ణేతలను, సీసీఐని ప్రోత్సహించేదిగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని వార్తా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 

డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్‌పీఏ) దాఖలు చేసిన ఫిర్యాదుపై డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలపై గూగుల్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఇప్పటికే ఆదేశించింది. డీఎన్‌పీఏ సభ్యులుగా జాగరణ్‌ న్యూ మీడియా (దైనిక్‌ జాగరణ్‌ గ్రూప్‌) అమర్‌ ఉజాలా, దైనిక్‌ భాస్కర్‌, ఇండియా టుడే, హిందుస్థాన్‌ టైమ్స్‌, ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఈనాడు, మలయాళ మనోరమా, ఏబీపీ నెట్‌ వర్క్‌, జీ మీడియా, మాతృభూమి, హిందూ, ఎన్‌డీటీవీ, లోక్‌మత్‌, ఎక్స్‌ప్రెస్‌ నెట్‌ వర్క్‌ తదితర సంస్థలు ఉన్నాయి. జనవరి 7న సీసీఐ ఈ అంశంపై విచారణకు సీసీఐ డీజీతో దర్యాప్తునకు ఆదేశించింది. 60 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే, విచారణకు అర్హమైన చట్టంలోని 4(2)(ఎ)లోని  నిబంధనల్ని గూగుల్‌ ఉల్లంఘించిందని కమిషన్‌ ప్రాథమికంగా అభిప్రాయపడింది. విచారణ సమయంలో మీడియా సంస్థల ఆరోపణల్ని కూడా డీజీ తగిన విధంగా పరిశీలించవచ్చని సీసీఐ తన ఉత్తర్వుల్లో  పేర్కొంది. 2002లో గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్ ఎల్‌ఎల్‌సీ, గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్‌పై కంపిటిషన్‌ చట్టంలోని సెక్షన్‌ 19(1)(ఎ)కింద డీఎన్‌పీఏ ఫిర్యాదు చేసింది. గూగుల్‌ గుత్తాధిపత్యంతో వ్యవహరిస్తూ తమకు న్యాయంగా రావాల్సిన వాటాను చెల్లించకపోవడం కాంపిటిషన్‌ చట్టంలోని సెక్షన్‌ 4ని ఉల్లంఘిస్తోందని డీఎన్‌పీఏ ఆరోపించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని