ఈ బాధలు భరించలేకపోతున్నానంటూ అమెరికాలో ప్రవాస భారతీయురాలి ఆత్మహత్య

కుమార్తెలకు జన్మనిస్తున్నావంటూ భర్త వేధింపులు.. అత్తింటివారి సూటిపోటి మాటలు భరించలేని ఓ ప్రవాస భారతీయురాలు తనువు చాలించింది........

Published : 07 Aug 2022 01:49 IST

దిల్లీ: కుమార్తెలకు జన్మనిస్తున్నావంటూ భర్త వేధింపులు.. అత్తింటివారి సూటిపోటి మాటలు భరించలేని ఓ ప్రవాస భారతీయురాలు తనువు చాలించింది. అంతకుముందే తన బాధలను వెళ్లగక్కుతూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది.  ‘ప్రతిరోజు ఈ దాడులను భరించలేను. ఎనిమిదేళ్లుగా క్షోభకు గురవుతున్నా’ అంటూ అందులో వాపోయింది. తన బాధలను పంచుకుంటూ.. చనిపోతున్నాను డాడీ నన్ను క్షమించు అంటూ పోస్ట్‌ చేసిన వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన మన్‌దీప్‌ కౌర్‌ (30)కు రన్‌జోద్‌బీర్‌ సింగ్‌ సంధుకు 2015లో వివాహం జరిగింది. అనంతరం వీరు అమెరికాలోని న్యూయార్క్‌కు వలస వెళ్లారు. వారికి 4, 2ఏళ్ల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే కుమార్తెలు సంతానంగా కలగడంతో కౌర్‌కు వేధింపులు మొదలయ్యాయి. భర్త శారీరకంగా హింసించేవాడు. అత్తింటివారు సైతం మానసికంగా హింసించేవారు. ‘ఆత్మహత్య చేసుకొని చనిపోమ్మంటూ అత్తింటివారు వేధిస్తున్నారు’ అని కౌర్‌ ఆ వీడియోలో వాపోవడం ఆమె దీన స్థితికి అద్దం పడుతోంది. భర్త దాడులకు సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, వీటిని భరించలేని మన్‌దీప్‌ కౌర్‌ వీడియోలో తన బాధను పంచుకుంది. ఎనిమిదేళ్లుగా ఈ బాధలను అనుభవిస్తున్నానని, ఇకనైనా భర్త మారతాడేమోనని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఇన్ని బాధలను అనుభవిస్తూ ఇకపై బతికుండలేనని పేర్కొంటూ.. ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. యూపీలోని మృతురాలి తల్లిదండ్రులు ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా ఆమె మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేలా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, భర్త, అతడి కుటుంబం సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారా లేదా అనే అంశంపై సమాచారం లేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని