Mahua Moitra: మహువాపై ఆరోపణలు.. రంగంలోకి సీబీఐ..?

ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై ‘లోక్‌పాల్‌’ ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ నమోదు చేసినట్లు సమాచారం.

Published : 25 Nov 2023 20:29 IST

దిల్లీ: పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ‘లోక్‌పాల్‌ (Lokpal)’కూ ఫిర్యాదు చేసినట్లు భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే గతంలో వెల్లడించారు. ఈ క్రమంలోనే లోక్‌పాల్‌ ఆదేశాల మేరకు సీబీఐ (CBI) రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ కేసులో మహువా మొయిత్రాపై ప్రాథమిక విచారణ (Preliminary Enquiry)ను నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయని పలు వార్తాసంస్థలు పేర్కొన్నాయి.

ఈ కేసులో ఎంపీ మహువాపై వచ్చిన ఆరోపణలు పూర్తిస్థాయి విచారణకు అర్హత కలిగి ఉన్నాయా? తెలుసుకునేందుకు ఇది మొదటి అడుగు. ఈ విచారణలో వెలుగుచూసే అంశాల ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేయాలా? వద్దా? అనే దానిపై సీబీఐ నిర్ణయం తీసుకుంటుంది. లోక్‌పాల్ ఆదేశాల ఆధారంగా ఈ విచారణ ప్రారంభించినందున.. ఈ ప్రాథమిక విచారణ నివేదికను సీబీఐ ఆ సంస్థకే సమర్పించనున్నట్లు సమాచారం. అయితే.. ఈ వ్యవహారంపై అటు లోక్‌పాల్, ఇటు సీబీఐల నుంచి అధికారిక ప్రకటనేదీ రాలేదు.

మహువా వివాదం.. మౌనం వీడిన మమతా బెనర్జీ!

ఇదిలా ఉండగా.. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొనేందుకు ఎంపీ మహువా మొయిత్రా.. ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి డబ్బులు, బహుమతులు తీసుకున్నారంటూ నిషికాంత్‌ ఆరోపించారు. మహువాను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ.. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. స్పీకర్‌ సిఫార్సు మేరకు దీనిపై లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు వార్తలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని