DBTతో కేంద్ర పథకాల్లోనే.. రూ.2.2లక్షల కోట్ల ఆదా..!

ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) అనేది ప్రభుత్వ పథకాల్లో కీలకంగా మారిందని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి వెల్లడించారు. వీటి వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాల్లోనే (Schemes) రూ.2.2లక్షల కోట్లు ఆదా అయ్యిందని చెప్పారు.

Published : 05 Mar 2023 20:32 IST

హైదరాబాద్‌: వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు (Beneficiaries) ప్రయోజనాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT)ను వినియోగిస్తున్నాయి. ఈ ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి వల్ల కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాల్లోనే (Schemes) సుమారు 27 బిలియన్‌ డాలర్లు ( రూ.2.2లక్షల కోట్లు) ఆదా అయినట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్‌ సేథ్‌ వెల్లడించారు. దీన్ని వల్ల లబ్ధిదారులకు వేగంగా ప్రయోజనాలు అందడంతోపాటు ప్రభుత్వ పథకాల్లో అవినీతి నిర్మూలన సాధ్యమవుతోందన్నారు.

జీ-20 సదస్సులో భాగంగా గ్లోబల్‌ పార్ట్నర్‌షిప్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ రెండవ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న భారత ఆర్థికశాఖ కార్యదర్శి అజయ్‌ సేథ్‌ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ప్రజలకు, ప్రజల మధ్య, ప్రజలు-వాణిజ్యం మధ్య జరిగే ఆర్థిక కార్యకలాపాల తీరును డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) పూర్తిగా మార్చివేసిందన్నారు. వేగం, లబ్ధిదారులకే నేరుగా ప్రయోజనం, తక్కువ అవినీతికి ఆస్కారం, తప్పుడు లబ్ధిదారులను ఏరివేయడం వంటి ఎన్నో మార్పులు ఈ సాంకేతికతతోనే సాధ్యమైందన్నారు.

డీపీఐ ఆధారిత డీబీటీ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలకు కీలకంగా మారిందని.. దీనివల్ల దేశ పౌరులు ఎంతో ఉపశమనం పొందుతున్నారని అజయ్‌ సేథ్‌ వెల్లడించారు. వ్యాక్సిన్లతోపాటు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా కార్యక్రమాలను దీనిద్వారానే ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని