Chandrayaan-3: ‘మామా వచ్చేశాం’.. జాబిల్లిపై అడుగుపెట్టిన చంద్రయాన్‌-3

కోట్ల మంది భారతీయుల ఎదురుచూపులు ఫలించాయి. అగ్రరాజ్యాలకే అందని ద్రాక్షగా మారిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. జాబిల్లిపై చంద్రయాన్‌-3 విజయవంతంగా అడుగుపెట్టింది.

Updated : 23 Aug 2023 18:08 IST

బెంగళూరు: పున్నమి నిండు చందమామ సొగసు చూస్తూ వేల ఏళ్లుగా మురిసిపోయిన భారతావని మనసు.. ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. నెలరాజు గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయగీతిక వినిపించింది. 140కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ జాబిల్లిపై అడుగు పెట్టింది. పదిహేనేళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి విశ్వపరిశోధనల్లో కొత్త శ్వాస నింపిన భారత్‌.. ఇప్పుడు చంద్రయాన్‌-3తో జాబిల్లిపై ఎవరూ వెళ్లని దారుల్లో వెళ్లి.. ఎవరూ చూడని ‘దక్షిణ’ జాడల్ని ప్రపంచానికి చూపించింది. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు ల్యాండర్‌ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపి.. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.

41 రోజుల ప్రయాణం..

నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జులై 14న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు.

ఆ తర్వాత ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన ‘ల్యాండర్‌ మాడ్యూల్‌’ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. ఆ తర్వాత రెండు సార్లు డీ-అర్బిట్‌ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్‌ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు.

విక్రమ్‌ పరాక్రమ్‌..

అలా బుధవారం సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్‌ మాడ్యూల్‌.. ల్యాండింగ్‌ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇస్రో.. ల్యాండింగ్‌ మాడ్యూల్‌కు ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ సీక్వెన్స్‌ (ALS) కమాండ్‌ను పంపించింది. ఈ కమాండ్‌ను అందుకున్న ల్యాండర్‌ మాడ్యూల్‌.. తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ మొదలుపెట్టింది. తన నాలుగు థ్రాటల్‌బుల్‌ ఇంజిన్లను ప్రజ్వలించి తన వేగాన్ని తగ్గించుకుంది. రఫ్‌ బ్రేకింగ్‌ దశను విజయవంతంగా ముగించుకుని జాబిల్లి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది.

ఆ తర్వాత ల్యాండర్‌ మాడ్యూల్‌ తన దిశను మార్చుకుంది.  ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా (ఎల్‌పీడీసీ), కేఏ బ్యాండ్‌ అండ్‌ లేజర్‌ బేస్డ్‌ ఆల్టీమీటర్లు, లేజర్‌ డాప్లర్‌ వెలోసీమీటర్‌ వంటి సాధనాలతో గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా జాబిల్లి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. చివరిగా ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపింది.

తొలి దేశంగా సరికొత్త చరిత్ర..

జాబిల్లి దక్షిణ ధ్రువం..! అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందని ద్రాక్ష అది. అలాంటి కఠినమైన చోట వ్యోమనౌకను సురక్షితంగా దించి భారత్‌ సరికొత్త చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా అవతరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని