Salman Khurshid: ‘ఖర్గే అధ్యక్షుడైనా.. గాంధీ కుటుంబమే లీడర్‌’: సల్మాన్‌ ఖుర్షీద్

కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. దాంతో భాజపా తన విమర్శలకు పదును పెట్టింది. 

Published : 30 Dec 2022 01:05 IST

దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేవలం పార్టీని నడుపుతారని, గాంధీ కుటుంబం చేతిలోనే నాయకత్వం ఉంటుందని ఆ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన మాటలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు భాజపాకు అస్త్రంగా మారాయి. 

‘నిజం బయటకువచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ నేత చెప్పినట్లుగా.. ఎవరు పార్టీ అధ్యక్షులు అయినా దాని పగ్గాలు మాత్రం సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ చేతిలోనే ఉంటాయి. మల్లికార్జున ఖర్గేను రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడు లేక రబ్బర్‌ స్టాంప్ అధ్యక్షులు అని పిలుద్దామా..? ఆయన గాంధీలు చెప్పిందే చేస్తారు. కాంగ్రెస్ అంతర్గత ఎన్నికలు ఒక బూటకం’ అని భాజపా అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా విమర్శలు చేశారు. 

తాజాగా ఖుర్షీద్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాంధీ కుటుంబానిదే అని అన్నారు. ‘మా లీడర్‌ గాంధీ కుటుంబమే. ఎప్పటికీ వారే. ఖర్గే పార్టీని నడుపుతారు. పార్టీ కార్యకలాపాలపైనే ఆయన దృష్టి సారిస్తారు’ అని వెల్లడించారు. 

ఇటీవల ఈ నేత.. రాహుల్‌ గాంధీని రాముడితో పోల్చారు. అతనో యోగి, తపస్వి, మహాపురుషుడని వ్యాఖ్యానించారు. ‘రాహుల్‌ రాముడి వంటివారు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా భరతుడి లాంటివారు. కొన్నిసార్లు రాముడు వెళ్లలేని చోటుకు భరతుడు అతని పాదుకలను తీసుకెళ్లాడు. అలాగే, జోడోయాత్ర సందర్భంగా రాహుల్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్నా, అన్నిచోట్లకూ స్వయంగా వెళ్లలేరు. కాంగ్రెస్‌ కార్యకర్తలే భరతుడి మాదిరిగా ఆయన సందేశాన్ని రాష్ట్రమంతా తీసుకెళ్లాలి’ అని పిలుపునిచ్చారు. దీనిపై భాజపా విమర్శలు గుప్పించింది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కానీ ఖుర్షీద్ వెనక్కి తగ్గలేదు. తన మాటలను సమర్థించుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని