‘మాంసం, గుడ్లను బాగా ఉడికించి తినండి’

ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) కారణంగా గత పదిరోజులుగా దేశ వ్యాప్తంగా లక్షల పక్షులు మరణిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ మేరకు పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది.

Published : 06 Jan 2021 20:15 IST

ప్రజలకు సూచించిన కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
10 యూరోపియన్‌ దేశాల్లో బర్డ్‌ఫ్లూ పంజా

దిల్లీ: ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) కారణంగా గత పదిరోజులుగా దేశ వ్యాప్తంగా లక్షల పక్షులు మరణిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ మేరకు పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది. పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. ఈ వైరస్‌ మానవులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర పాడి, పశుసంవర్ధకశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ట్విటర్‌లో తెలిపారు. ‘‘ ప్రజలంతా మాంసం, గుడ్లను తినేటపుడు బాగా ఉడికించి తినాలి. భయపడాల్సిందేమీ లేదు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ బర్డ్‌ఫ్లూను గుర్తించారన్న నివేదికను కూడా ఆయన విడుదల చేశారు.
యూరోపియన్‌ దేశాలపై పంజా..
గత కొన్ని వారాలుగా యూరోపియన్‌ దేశాల్లో కూడా బర్డ్‌ఫ్లూ ప్రభావం కనిపిస్తోంది. నెదర్లాండ్స్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, పోలండ్‌, క్రొయేషియా, ఉక్రెయిన్‌లలో బర్డ్‌ఫ్లూను కనుగొన్నామని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (ఈసీడీసీ) వెల్లడించింది. ఫ్రాన్స్‌లో సుమారు ఆరు లక్షలకు పైగా పౌల్ట్రీ పక్షులను వధించారు. జర్మనీలో 62వేల టర్కీ, బాతులను వధించినట్లు అధికారులు తెలిపారు. ఈ వైరస్‌ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి మానవుల మధ్య సంక్రమించే అవకాశం లేదని వెల్లడించింది.

ఇవీ చదవండి..

WHO అసహనంపై స్పందించిన చైనా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని