Corona: విమానంలో 179మంది.. అందులో125 మందికి కరోనా..!

ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ విమానంలో వంద మందికి పైగా ప్రయాణికులకు వైరస్‌

Updated : 06 Jan 2022 17:00 IST

అమృత్‌సర్‌: ఒమిక్రాన్‌ వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ విమానంలో వంద మందికి పైగా ప్రయాణికులకు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అవడం కలకలం రేపుతోంది. ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అంతర్జాతీయ ఛార్టెడ్‌ విమానంలో 125 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు విమానాశ్రయ డైరెక్టర్‌ వీకే సేథ్‌ వెల్లడించారు. 

దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘ఎట్ రిస్క్‌’ దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. ఇందులో భాగంగానే ఇటలీ నుంచి ఓ ఛార్టెడ్‌ విమానం అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే.. అందులోని ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్‌ టెస్టుల్లో మొత్తం 125 మంది ప్రయాణికులకు వైరస్‌ సోకినట్లు తేలింది.  

మిలన్‌ నుంచి బయల్దేరిన ఈ విమానం ఈ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో అమృత్‌ సర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులున్నారు. ఇందులో 19 మంది చిన్నారులు. వారిని మినహాయించి పెద్దలందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు పాజిటివ్‌ తేలడంతో అప్రమత్తమైన అధికారులు వారిని క్వారెంటైన్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు ముందు అంబులెన్స్‌లు బారులు తీరాయి. 

మరోవైపు తమకు కరోనా పాజిటివ్‌ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటలీ నుంచి బయల్దేరేప్పుడు తమకు నెగెటివ్‌ వచ్చిందని, ఇప్పుడు పాజిటివ్‌ ఎలా వస్తుందని ప్రశ్నించారు. తమను బయటకు వెళ్లనివ్వాలని కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టులో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని