Covid Origins: మరోసారి దర్యాప్తునకు WHO సన్నాహాలు!

కరోనా వైరస్‌ మూలాలపై మరోసారి జరిపే దర్యాప్తునకు సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను కోరింది.

Updated : 13 Sep 2022 14:57 IST

సహకరించాలని చైనాను కోరిన WHO చీఫ్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మూలాలపై మరోసారి జరిపే దర్యాప్తునకు సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను కోరింది. వైరస్‌ మూలాలపై శోధన జరిగే సమయంలో చైనా నుంచి పూర్తి సహకారంతో పాటు పారదర్శకంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది. జి-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌, కరోనా వైరస్‌ మూలాలకు సంబంధించిన అంశంపై ఈ విధంగా స్పందించారు.

‘కరోనా మూలాలకు సంబంధించి చైనా నుంచి సహకారం అవసరమని మనందరికీ తెలుసు. కొవిడ్‌ మూలాలను కనుక్కోవడం లేదా తెలుసుకోవడం లేదా అర్థంచేసుకునే విషయంలో మనకు పారదర్శకత అవసరం. నివేదిక విడుదలైన తర్వాత సమాచారాన్ని పంచుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రాథమిక సమాచారం విషయంలో తీవ్ర సమస్యలు తలెత్తాయి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు. అయితే, దర్యాప్తులో భాగంగా తదుపరి దశలకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ విషయంపై ఇప్పటికే జి-7దేశాల సదస్సులోనూ చర్చ జరిగిందని తెలిపారు.

ఏడాదిన్నర ముగిసినా.. కరోనా వైరస్‌ మూలాలపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా వైరస్‌ సహజ సిద్ధంగానే ఉద్భవించిందా..? లేక వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. వీటిపై ఇప్పటికే ఒకసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసినప్పటికీ వైరస్‌ మూలాలపై నిపుణులు సరైన నిర్ధారణకు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో మిస్టరీ మూలాలపై మరోసారి దర్యాప్తు జరపాలనే డిమాండ్‌ ప్రపంచవ్యాప్తంగా మరింత ఎక్కువైంది. ఇందులో భాగంగా  ప్రపంచ ఆరోగ్య సంస్థ సకాలంలో, పారదర్శకంగా, సాక్ష్యాల ఆధారంగా జరిపే స్వతంత్ర దర్యాప్తునకు పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా, బ్రిటన్‌ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని