ఆండ్రాయిడ్‌ యూజర్లకు అలర్ట్‌.. ఈ వైరస్‌తో కాల్‌ రికార్డ్స్‌, కాంటాక్టులు హ్యాక్‌!

Daam virus: ఆండ్రాయిడ్‌ (Android) ఫోన్లలో Daam పేరుతో ఉన్న ఓ వైరస్‌ వ్యాపిస్తోందని.. కాల్‌ రికార్డులను తస్కరించడంతోపాటు కాంటాక్ట్స్‌, హిస్టరీ, కెమెరాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇది హ్యాక్‌ చేస్తుందని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ విభాగం (CERT-In) సూచించింది.

Published : 27 May 2023 02:05 IST

దిల్లీ: ఆండ్రాయిడ్‌ (Android) ఫోన్లను ఓ కొత్త వైరస్‌ కలవరపెడుతోంది. దామ్‌ (Daam Virus) పేరుతో ఉన్న ఈ వైరస్‌.. ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని కాల్‌ రికార్డులను తస్కరిస్తున్నట్లు వెల్లడైంది. వీటితోపాటు కాంటాక్ట్స్‌, హిస్టరీ, కెమెరాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇది హ్యాక్‌ చేస్తుందని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ (Cyber Security) విభాగం CERT-In వెల్లడించింది. యాంటీవైరస్‌కు చిక్కకపోవడంతోపాటు లక్షిత ఫోన్లలో వైరస్‌ను చొప్పించే సామర్థ్యం ఈ వైరస్‌కు ఉందని పేర్కొంటూ ఆండ్రాయిడ్‌ యూజర్లకు తాజా అడ్వైజరీ జారీ చేసింది.

‘థర్డ్‌పార్టీ వెబ్‌సైట్లు లేదా ఇతర విశ్వసనీయతలేని సైట్ల ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఒకసారి ఇది ఫోన్లోకి వచ్చిన తర్వాత సెక్యూరిటీ విభాగాలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అనంతరం సున్నితమైన డేటాను తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. హిస్టరీ, బుక్‌మార్కులను చదవడం.. బ్యాక్‌గ్రౌండ్‌ ప్రాసెసింగ్‌ను కిల్‌ చేయడంతోపాటు కాల్‌లాగ్స్‌ను రీడ్‌ చేయడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా ఫోన్‌ కాల్‌ రికార్డింగ్స్‌, కాంటాక్టులను హ్యాక్‌ చేయడం, కెమెరా యాక్సెస్‌ పొందడం, డివైజ్‌ పాస్‌వర్డులను మార్చడం, స్క్రీన్‌షాట్స్‌ను తీయడం, ఎస్సెమ్మెస్‌లను తస్కరించడం, ఫైల్స్‌ డౌన్‌లోడింగ్‌/అప్‌లోడింగ్‌ చేయడంతోపాటు వీటిని బాధిత ఫోన్‌ నుంచి సర్వర్‌కు చేరవేసే సామర్థ్యం ఈ వైరస్‌కు ఉంది’ అని CERT-In పేర్కొంది.

ఇటువంటి వైరస్‌లు, మాల్వేర్‌ల బారినపడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని CERT-In సూచించింది. విశ్వసనీయత లేని వెబ్‌సైట్లును బ్రౌజ్‌ చేయొద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయొద్దని సూచించింది. అప్‌డేటెడ్‌ యాంటీవైరస్‌, యాంటీ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌లను వినియోగించాలని పేర్కొంది. సాధారణ మొబైల్‌ నంబర్లు కాకుండా అనుమానాస్పదంగా కనిపించే నంబర్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపింది. బ్యాంకుల పేరుతో వచ్చే ఎస్సెమ్మెస్‌లు సరైనవేనా కాదా అనే విషయాన్ని జాగ్రత్తగా చూసి స్పందించాలని, షార్ట్‌ యూఆర్‌ఎల్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని CERT-In సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు