divorce: ఆ దేశంలో విడాకులు తీసుకోలేరు!
కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడమే ఆలస్యం.. విడాకులు తీసుకుని ఎవరికివారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు
కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడమే ఆలస్యం.. విడాకులు తీసుకుని ఎవరికివారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు. అలాంటి పద్ధతి ఈ మధ్య భారత్‌లోనూ మొదలైంది. వివాహమై కొన్ని నెలలైనా గడవక ముందే చిన్న చిన్న విషయాలకే గొడవ పడి కోర్టుమెట్లు ఎక్కుతున్న జంటలు ఉన్నాయి. తమ మధ్య విభేదాలొచ్చి విడిపోవాలని కోరుకునే దంపతులకు అధికారికంగా విడాకులు తీసుకోవడానికి అన్ని దేశాల్లోనూ చట్టాలున్నాయి. కానీ ప్రపంచంలో విడాకులు తీసుకోవడానికి వీలులేని ఏకైక దేశం ఫిలిప్పీన్స్. ఎందుకో తెలుసా?
మత విశ్వాసాలే కారణమా?
ఫిలిప్పీన్స్‌లో చాలామంది క్రైస్తవ క్యాథలిక్‌లే ఉన్నారు. క్యాథలిక్ పద్ధతులను పాటించే వారు విడాకులను వ్యతిరేకిస్తుంటారు. అందుకే అక్కడి నేతలు తమ దేశ చట్టాల్లో విడాకుల అంశాన్ని చేర్చలేదు. ముఖ్యంగా అప్పటి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడైన బనినో అక్వినో విడాకులు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. విడాకుల చట్టాలు లేకపోవడంతో అక్కడి ప్రజలకు చట్టబద్ధంగా విడిపోవడానికి అవకాశమే లేదు. 2015లో పోప్ ఫ్రాన్సిస్ ఆ దేశాన్ని సందర్శించినప్పుడు విడాకులు కోరుకుంటున్న దంపతుల విషయంలో సానుకూలంగా స్పందించమని ప్రభుత్వానికి సూచించారు. కానీ ఆ దేశ ప్రజలు విడాకులు తీసుకోవడాన్ని అగౌరవంగా భావిస్తుంటారు. అందుకే పోప్ అభ్యర్థనను సైతం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రపంచంలో విడాకులే లేని దేశం తమదని గర్వంగా చెప్పుకోవాలనేదే అక్కడి నేతల కోరిక.
మధ్యలో తెచ్చిన చట్టాలు మధ్యలోనే మాయం!
ఫిలిప్పీన్స్‌ను మొదట్లో స్పెయిన్ స్వాధీనం చేసుకొని కొన్ని శతాబ్దాలు పాలించింది. ఈ క్రమంలో ఆ దేశ ప్రజలు క్యాథలిక్ క్రైస్తవులుగా మారారు. దీంతో క్యాథలిక్ సంప్రదాయాలు, కట్టుబాట్లు వారిలో జీర్ణించుకుపోయాయి. అందుకే విడాకులు తీసుకోవడాన్ని వారు అగౌరవంగా భావిస్తారు. అధికారికంగా వారు విడిపోలేరు. కాబట్టి ఎవరైనా సరే.. భార్య/భర్త నుంచి విడిపోయి వేరుగా ఉండలేరు. ఒకవేళ ఎవరైనా అలా విడిగా ఉంటే, వారిని నీచంగా చూస్తారు. అయితే, 1898లో స్పానిష్-అమెరికా యుద్ధం జరిగింది. అప్పుడు స్పెయిన్ అధీనంలో ఉన్న ఫిలిప్పీన్స్ అమెరికా హస్తగతమైంది. ఆ తర్వాత అమెరికా పాలకులు ఫిలిప్పీన్స్‌లో విడాకుల చట్టాన్ని ప్రవేశపెట్టారు. అయితే, విడాకులు తీసుకోవడానికి ఒకే ఒక నిబంధన పెట్టారు. భార్యభర్తల్లో ఎవరో ఒకరు వ్యభిచారం చేస్తున్నట్లు తేలితేనే విడాకులు మంజూరు చేయాలని చట్టం చేశారు.
రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఫిలిప్పీన్స్‌ను జపాన్ ఆక్రమించింది. అమెరికా చేసిన విడాకుల చట్టాన్ని జపాన్ రద్దు చేసి మరో చట్టం తెచ్చింది. కానీ అది కూడా ఎక్కువ రోజులు అమలులో లేదు. 1944లో తిరిగి అమెరికా ఫిలిప్పీన్స్‌ను ఆక్రమించుకోవడంతో పాత విడాకుల చట్టాన్నే తిరిగి అమల్లోకి తెచ్చింది. కాగా.. 1946లో అమెరికా నుంచి స్వాతంత్ర్యం పొందిన ఫిలిప్పీన్స్ అమెరికా, జపాన్ చేసిన చట్టాలను తొలగించింది. అసలు తమ దేశ చట్టాల్లో విడాకులన్న పదమే లేకుండా చేసింది. అయితే, ఆ దేశంలోని మైనార్టీ ముస్లింలు మాత్రం తమ మతాన్ని అనుసరించి విడాకులు తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం వీలు కల్పించింది.
విడాకుల చట్టం ప్రతిపాదనలు.. విమర్శలు
విడాకులను చట్టబద్ధం చేయడానికి పలుమార్లు విడాకుల ముసాయిదా బిల్లు రూపొందించినా ఇప్పటికీ దానికి చట్టసభల్లో ఆమోదముద్ర పడలేదు. కొన్ని నెలల కిందట రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లును జనాభా, కుటుంబ సంబంధాలశాఖ కమిటీ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని దాని రూపకర్తలు చెబుతున్నారు. దీనికి చట్టసభల్లోనూ ఆమోదం లభించాలని కాంక్షిస్తున్నారు. మరోవైపు క్యాథలిక్ పద్ధతులను అనుసరించే పాలకులు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఆమోదిస్తే వివాహం, కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని అంటున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS High court: జూనియర్ లెక్చరర్ పరీక్షపై టీఎస్పీఎస్సీ నిర్ణయం సరికాదు: హైకోర్టు
-
World News
Iran: ఇరాన్-సౌదీ బంధంలో మరో ముందడుగు
-
Politics News
Rahul Gandhi:యువతకు 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. ₹3వేలు నిరుద్యోగ భృతి: రాహుల్ హామీ
-
Sports News
IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు.. భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష
-
India News
Khalistan: ఆగని ఖలిస్థానీ అనుకూలవాదుల దాడులు.. నిన్న లండన్.. నేడు శాన్ఫ్రాన్సిస్కో
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు