Ayodhya: ఆహ్వానం అందలేదు..! అయోధ్య ఉద్యమంలో ‘శివసేన’ది సుదీర్ఘ పోరాటం: ఉద్ధవ్‌ ఠాక్రే

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు ఇంకా ఆహ్వానం అందలేదని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు.

Published : 30 Dec 2023 20:00 IST

ముంబయి: అయోధ్య (Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram temple Consecration) ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మహత్తర కార్యక్రమంలో భాగం కావాల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌.. దేశవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అయితే, తనకు ఇంకా ఆహ్వానం అందలేదని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) వెల్లడించారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడు కాబట్టి, తనకు ఆహ్వానం అవసరం లేదని వ్యాఖ్యానించారు. తనకు శ్రీరాముని దర్శనం కావాలని అనిపిస్తే అయోధ్యను సందర్శిస్తానని మీడియాతో చెప్పారు.

రామజన్మభూమి ఉద్యమం కోసం ‘శివసేన’ సుదీర్ఘ పోరాటం చేసిందని ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. 1990ల్లో ఎన్నికల సమయంలో రామ మందిరం, హిందుత్వ కోసం ప్రచారం చేసినందుకు తన తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఓటుహక్కుపై ఈసీ నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘రామమందిర ప్రారంభోత్సవం ఓ రాజకీయ కార్యక్రమంలా మారకూడదు. ఎందుకంటే.. రాముడు ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు. ఇది కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయం. సుప్రీం కోర్టు నిర్ణయమే రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. ఇందులో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు’ అని భాజపాను ఉద్దేశించి విమర్శలు ఎక్కుపెట్టారు.

జనవరి 22 కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది: ప్రధాని మోదీ

తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అయోధ్యను సందర్శించినట్లు ఠాక్రే గుర్తుచేసుకున్నారు. మరోవైపు.. బాబ్రీ మసీదు ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో బాల్ ఠాక్రే సహా 109 మంది శివసైనికులు ఉన్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఇదిలా ఉండగా.. జనవరి 22న నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు సహా ప్రముఖులకు కేంద్రం ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా 6 వేల మందికిపైగా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని