Maratha Quota: అలాంటి రాజకీయాలు ఎన్నడూ చేయలేదు : శరద్‌ పవార్‌

ఓబీసీ వర్గానికి (OBC category) చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఓ సర్టిఫికేట్‌ వైరల్‌ కావడంపై స్పందించిన శరద్‌ పవార్‌.. ఇలాంటి అంశాలపై తాను ఎన్నడూ రాజకీయాలు చేయలేదన్నారు.

Published : 14 Nov 2023 17:31 IST

బారామతి: తన సామాజికవర్గం పేరును దాచుకునే ఉద్దేశం తనకు లేదని.. దాని పేరు చెప్పి ఎన్నడూ రాజకీయాలు చేయలేదని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) పేర్కొన్నారు. పవార్‌ ఓబీసీ వర్గానికి (OBC category) చెందిన వ్యక్తి అని పేర్కొంటూ ఓ సర్టిఫికేట్‌ వైరల్‌ అయిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. అంతకుముందే ఇదే విషయంపై ఎన్సీపీ ఎంపీ, పవార్‌ కుమార్తె సుప్రియా సూలే (Supriya Sule) కూడా స్పందించారు. అదో తప్పుడు ధ్రువపత్రం అని పేర్కొన్న ఆమె.. అలాంటివి వైరల్‌ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

‘నా సామాజికవర్గం ఏంటో ప్రపంచం మొత్తం తెలుసు. దాని ఆధారంగా నేను రాజకీయాలు చేయలేదు. అటువంటివి భవిష్యత్తులోనూ చేయను. కానీ, ఆ వర్గం సమస్యల పరిష్కారానికి అన్నివిధాలా కృషి చేస్తాను’ అని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు. ఓబీసీ వర్గం అంటే ఎంతో గౌరవం ఉందని.. తాను పుట్టిన కులాన్ని దాచుకునేందుకు ఇష్టపడనని అన్నారు. మరాఠా కోటా (Maratha quota) గురించి మాట్లాడిన పవార్‌.. రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఉందన్నారు. మరాఠా కోటాపై యువతరంలో సెంటిమెంట్‌ చాలా తీవ్రంగా ఉందన్న ఆయన.. దానిని విస్మరించలేమన్నారు. అయితే, ఈ నిర్ణయాధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందన్నారు.

‘మరాఠా కోటా’ ఇచ్చేందుకు మా ప్రభుత్వం సుముఖంగా ఉంది: మహారాష్ట్ర సీఎం

ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని మరాఠాలు డిమాండు చేస్తున్నారు. ఈ అంశంపై మహారాష్ట్రలో కొంతకాలంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం.. మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుకూలమేనని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే ప్రకటించారు. అయితే, చట్టపరంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం కావాలని, అంతవరకు మరాఠా సామాజికవర్గం నేతలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని